తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చినజీయర్ స్వామిల మధ్య విభేదాలు వచ్చాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. శ్రీరామానుజ మహా విగ్రహావిష్కరణ శిలాఫలకంలో సీఎం కేసీఆర్ పేరు లేకపోవడంతో మొదలైన వివాదం…ప్రధాని మోదీని చినజీయర్ స్వామి గొప్పగా కీర్తించడంతో తారస్థాయికి చేరుకుందని పుకార్లు వచ్చాయి. మోదీ పాలనపై ప్రశంసలు కురిపించిన చిన జీయర్ స్వామి…ఆయనను శ్రీరామచంద్రుడితో పోల్చడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.
దీంతో, ఈ నెలలో జరగనున్న యాదాద్రి ఆలయ పున:ప్రారంభ వేడుకకు కేసీఆర్ వస్తారా? రారా అన్న చర్చ జరుగుతోంది. అయితే, తమ మధ్య విభేదాలు లేవని చినజీయర్ స్వామి తేల్చిపారేశారు. కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నందుకే రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతమైందని, ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాకపోవడానికి అనారోగ్యం లేదా పనుల ఒత్తిడి కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం సద్దుమణగక ముందే చిన జీయర్ స్వామిపేరు మరో వివాదంలో వినిపిస్తోంది.
సమ్మక్క-సారలమ్మలను చినజీయర్ స్వామి అవమానించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వారు, వ్యాపారవేత్తలు ఆ దేవతలను దర్శించుకోవడం ఏంటని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై సీతక్క మండిపడుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకలైన సమ్మక్క-సారలమ్మపై ఆంధ్రా చినజీయర్ స్వామి ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిలదీస్తున్నారు.
ఆదివాసుల ఆత్మగౌరవానికి ప్రతీకగా, తెలంగాణ బిడ్డల కోరికలు తీర్చే సమ్మక్క-సారలమ్మల జాతర ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అని, అటువంటి జాతర వైభవాన్ని, దేవతల కీర్తిని తగ్గించేలా చేసిన వ్యాఖ్యలపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. తమ దేవతలు ప్రకృతి దేవతలని, అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ జరగడం లేదని సీతక్క అన్నారు.
120 కిలోల బంగారంతో చేసిన సమతామూర్తిని దర్శించుకోవాలంటే రూ.150 టికెట్టు కొనుక్కోవాలని, కానీ, తమ దేవతల దగ్గర తాము వ్యాపారం చేయడం లేదని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాలని, సర్కారు వైఖరి ఏంటో తెలియజేయాలని సీతక్క డిమాండ్ చేస్తూ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.