ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను జంగారెడ్డిగూడెం నాటుసారా ఘటన కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై అధికార పక్షాన్ని నిలదీస్తున్నారన్న కారణంతో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ల పర్వం మొదటి రోజు నుంచే మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న ఐదుగురు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్ తమ్మినేని…నేడు సభ నుంచి 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రామ్మోహన్రావు, సాంబశివరావు, సత్యప్రసాద్, చినరాజప్ప, అశోక్, అచ్చెన్నాయుడు, భవానీ, రామకృష్ణబాబు, వెంకటనాయుడు, రవికుమార్, జోగేశ్వరావులపై సస్పెన్షన్ వేటు పడింది. అంతకుముందు, టీడీపీ ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శలు గుప్పించారు.
టీడీపీ సభ్యులు ప్రతివిషయాన్ని కావాలనే రాజకీయం చేస్తున్నారని, అందుకే 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు నారాయణ స్వామి. టీడీపీ సభ్యుల జాతకాలు బయటపెడతానంటూ సభలోనే స్పీకర్ ముందు వార్నింగ్ ఇచ్చారు. తన ఆరోపణలు తప్పని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.
అయితే, జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలను ప్రభుత్వం సహజమరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందంటూ టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ఆ కల్తీ సారా మరణాలున్నీ ప్రభుత్వ హత్యలే అని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే చర్చ చేయాలని ఆందోళనలకు దిగారు. అయితే, న్యాయంగా చర్చజరపాలని కోరిన టీడీపీ సభ్యులపై తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సభ్యులు ఏది అడిగితే అది చేయడానికి కాదు.. ఇక్కడ ప్రభుత్వం ఉంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కనీసం ఫ్లోర్లో ఏం మాట్లాడాలో.. ఎలాంటి పదాలు వాడాలో కూడా తెలియదు…మీరు శాసనసభ్యులుగా ఉండటం మా ఖర్మ అంటూ అవమానకరరీతిలో మాట్లాడారు. తాను కాబట్టే టీడీపీ సభ్యులను భరిస్తున్నానని, ఇతరులైతే ఇది సాధ్యం కాకపోయి ఉండేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఆ తర్వాత మంత్రి నారాయణ స్వామి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ద్వారా ఓటింగ్ జరిపి 11మంది టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు.