అసెంబ్లీలో కొన్ని అంశాలపై విపక్ష సభ్యులు పట్టుబట్టడం…ఆ సందర్భంగా వారి మైకులు కట్ చేయడం…ఇంకాస్త మందుకెళితే కొందరు విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం వంటివి కామన్. సభా సంప్రదాయాలను గౌరవించాలంటూ గొంతు చించుకొని అరిచే అధికార పక్ష సభ్యులు మాత్రం సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నా సరే…అదే పార్టీకి చెందిన స్పీకర్ పల్లెత్తు మాట అనకుండా ఉండే సన్నివేశాలు వైసీపీ హయాంలో కోకొల్లలు. అయితే, తాజాగా జంగారెడ్డిగూడెం కల్తీ సారా ఘటన అసెంబ్లీని కుదిపేస్తున్న తరుణంలో…టీడీపీ సభ్యులు పదే పదే చర్చకు పట్టుబడుతున్నారు.
వెల్ లోకి దూసుకువచ్చి నిరసన తెలిపారు. ఇప్పటికే ఈ కారణంతో కొందరు సభ్యులను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించిన స్పీకర్ తమ్మినేని…తాజాగా ఈ రోజు మరికొందరు టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ కు గురైన వారిలో అశోక్ బెందాళం, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గణబాబు, భోగేశ్వరరావు, రామకృష్ణబాబు, రామరాజు, గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, సత్యప్రసాద్ ఉన్నారు.
అంతటితో టీడీపీ సభ్యులపై అక్కసు తీరకపోవడంతో వైసీపీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో గతంలో ఏ అధికార పక్ష సభ్యులు తీసుకోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పోడియానికి ముందు వైట్, రెడ్, గ్రీన్ లైన్స్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి ప్రతిపాదనకు వైసీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఆ గీతలు దాటితే ఆటోమేటిక్‌గా సభ్యులు సస్పెండ్ అవుతారని మునుపెన్నడూ లేని…ఆ మాటకొస్తే దేశంలో ఏ అసెంబ్లీలో లేని సరికొత్త రూల్ ను జగన్ అండ్ కో ప్రవేశపెట్టి చరిత్రపుటల్లో తమ పేరును లిఖించుకున్నారు. దీంతో, ఈ రూల్ పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.