కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తనను పచ్చిబూతులు తిట్టాడని, వినకూడని మాటలు అన్నాడని పవన్ ఆరోపించారు. అలాంటి వారికి గడ్డి పెట్టాలని వైవీ సుబ్బారెడ్డికి హితవు పలికారు. ఆ తర్వాత ద్వారంపూడికి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గతంలో ద్వారంపూడి కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ ట్రీట్ మెంట్ జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ చూపిస్తానంటూ పవన్ పంచ్ డైలాగులతో వార్నింగ్ ఇచ్చారు.
అయితే, పవన్ ఆ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చినప్పటికీ…ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరు మారలేదు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ద్వారంపూడి…తనకు అలవాటైన భాషలోనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన కోసం కొందరు లక్షల రూపాయలు ఖర్చుపెడుతున్నారని, వారందరినీ పవన్ తాకట్టు పెడతారని వివాదాస్పద కామెంట్లు చేశారు. సినిమాలు-రాజకీయాలు వేర్వేరని, ఈ తరహా సభలతో వచ్చిన పబ్లిసిటీతో పవన్ ప్యాకేజీలు మాట్లాడుకుంటారని సంచలన ఆరోపణలు చేశారు. అటువంటి పవన్ అందరికీ నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు.
పవన్ రీల్ హీరో అని, జగన్ రియల్ హీరో అని…దమ్ముంటే పవన్ సింగిల్ గా పొత్తులు లేకుండా పోటీ చేయాలని సవాల్ విసినారు. పవన్ వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారని ద్వారంపూడి విమర్శించారు. తన జోలికి పవన్ వస్తే క్షమించేది లేదంటూ బెదిరింపులకు దిగారు. పవన్ చర్యలను చూస్తూ ఊరుకోబోమని, జనసేన నాయకులు, కార్యకర్తలు తమ ఇంటిపైకి వస్తే చూస్తూ, చేతులు ముడుచుకుని కూర్చోబోమని తన అసలు నైజం బయటపెట్టారు. తమను కాకినాడలో ఏమీ చేయలేరని, తన వెంట్రుక కూడా పీకలేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.