ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాస్త సద్దుమణిగిన సంగతి తెలిసిందే. పదే పదే చిరంజీవి వంటి సినీ పెద్దలు అడుక్కోవడంతో జగన్ జాలిదలిచి టికెట్ రేటు పాతిక రూపాయలు పెంచారు. అది కూడా తన రాజకీయ ప్రత్యర్థి పవన్ సినిమా విడుదలైన తర్వాత కొత్త జీవో తెచ్చారు. సరే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న రీతిలో సినీ పెద్దలు సర్దుకొని….సీఎం జగన్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కొత్త జీవో వచ్చిన వెంటనే జగన్ ను థ్యాంక్స్ చెప్పిన దర్శకుడు రాజమౌళి…నిన్న నిర్మాత దానయ్యతో కలిసి జగన్ తో భేటీ అయ్యారు.
ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోన్న నేపథ్యంలో తమ సినిమాకు పాతిక రూపాయల పెంపు సరిపోదని, ఇంకొంచెం పెంచడానికి పర్మిషన్ ఇవ్వడంతో పాటు…బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతినివ్వాలని రాజమౌళి రిక్వెస్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది. మంత్రులు పేర్ని నాని ,కొడాలి నాని కూడా పాల్గొన్న ఈ మీటింగ్ లో జగన్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారని జక్కన్న కితాబిచ్చారు కూడా. చిరంజీవితో జగన్ కు ఉన్న అనుబంధం, చరణ్ సినిమా కావడంతో జక్కన్న రిక్వెస్ట్ కు జగన్ సానుకూలంగా స్పందిస్తారేమో అన్న ప్రచారం జరిగింది.
అయితే, మీటింగ్ అయిపోయిన కొద్ది సేపటికే మంత్రి పేర్ని నాని…జక్కన్న పరువు తీసేలా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ తో జక్కన్న భేటీ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని…తనదైన శైలిలో సమాధానమివ్వడం చర్చనీయాంశమైంది. కొత్త జీవో ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకే రాజమౌళి వచ్చారని, రాజమౌళి వస్తే ఒక రేటు…రాకుంటే మరొక రేటు ఉండదని షాకింగ్ కామెంట్లు చేశారు. పెద్ద సినిమాలకే కాదు.. చిన్న సినిమాలకు కూడా ఐదు షోలకు అనుమతి ఉందని చెప్పారు.
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ నాటికి చిన్న సినిమా రిలీజ్ లేకుంటే పెద్ద సినిమా ఐదు షోలు వేసుకోవచ్చని అన్నారు. ఆర్ఆర్ఆర్తో పాటు చిన్న సినిమా విడుదలైతే ఆ ఐదు షోలలో ఒక షో కచ్చితంగా చిన్న సినిమాకు ఇవ్వాల్సిందేనన్నారు. ప్రభుత్వం సినీ టికెట్లపై కొత్త జీవో ఇచ్చిన తర్వాత సీఎంని కలిస్తామని రాజమౌళి తనను కోరారని, అందుకోసం ఈ రోజు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని అన్నారు.