జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో జగన్ పై జనసేనాని పవన్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ఇక, వైసీపీ నేతల పరువునైతే హోల్ సేల్ గా నిండు సభలో తీసేశారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలనను ఆరంభించిన జగన్….ఇప్పటంలో తమ సభకు ఆటంకం కలిగించే వరకు కక్షాపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని పవన్ మండిపడ్డారు. అసలు వైసీపీ నేతలు ఏం అనుకొని రాజకీయాల్లోకొచ్చారో తనకర్థం కావడం లేదంటూ దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ఇంత నెగెటివ్ మనుషులేంటని తనకు చాలాసార్లు అనిపించిందని పవన్ సెటైర్లు వేశారు.
కానీ, వైసీపీలో బూతులు తిట్టే నేతలతో పాటుగా దివంగత నేత, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వంటివారూ ఉన్నారని పవన్ కితాబిచ్చారు. కేసీఆర్, కేటీఆర్, ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలలు, ఆనం రామనారాయణరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డిలకు నమస్కారాలు చెప్పిన పవన్…ఆ తర్వాత మాత్రం వైసీపీ నేతల తీరును పంచ్ డైలాగులతో, పవర్ ఫుల్ సెటైర్లతో ఎండగట్టారు.
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనకు ఒక ప్రతిజ్ఞ ఉంటుందని, అదే రీతిలో వైసీపీ నేతలకూ ఏదో ఒక దిక్కుమాలిన ప్రతిజ్ఞ ఉంటుందని పవన్ చురకలంటించారు. అలా ప్రతిజ్ఞ చేసుకోకపోతే వైసీపీ నేతలంతా ఇంత దరిద్రం చేయరు కదా అని పవన్ పంచ్ డైలాగులు పేల్చారు. బహుశా వైసీపీ నేతల ప్రతిజ్ఞ ఇలా చేసి రాజకీయాల్లోకి వచ్చుంటారంటూ అధికార పార్టీ నేతల గాలి తీశారు. వైసీపీ నేతల పరువు తీసేలా పవన్ తన పవర్ ఫుల్ డైలాగుల మాదిరిగా చెప్పిన ఈ ప్రతిజ్ఞ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం. న్యాయవ్యవస్థను లెక్కే చెయ్యం. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడేస్తాం. ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడతాం, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తాం. రాష్ట్ర రహదారులను గుంతలమయం చేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగ్గొడతాం. అలా విరగ్గొట్టేంత వరకు విశ్రమించం.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50 శాతం వాటా మేం లాక్కుంటాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థికమూలాలను దెబ్బకొడతాం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని చెబుతాం… కానీ అధికారంలోకి రాగానే వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం, వారు ఆత్మహత్యలు చేసుకుంటామంటే ప్రోత్సహిస్తాం. ఇసుకను అప్పడంలా కరకర నమిలేస్తాం. సహజ వనరులను మొత్తం వాడేసుకుంటాం.
దేవతా విగ్రహాలను ధ్వంసం చేసేవారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తాం. పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలను చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఆదాయ వనరులను పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే… చావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగ్గొట్టిస్తాం… మా వైసీపీ ఎంపీ అయినాసరే!
ఒక్క చాన్సు…. ఒక్క చాన్సూ… ఒక్క చాన్సిస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళతాం. ఇంకొక్క చాన్సిస్తే స్కూలుకెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాగేసుకుంటాం… ఇదీ వైసీపీ నేతల ప్రతిజ్ఞ!” అంటూ పవన్ తనదైన శైలిలో ఆ ప్రతిజ్ఞను మూడు పంచ్ లు…ఆరు సెటైర్లలాగా పేల్చారు. మరి, పవన్ పంచ్ లకు వైసీపీ నేతల రియాయక్షన్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.