టీడీపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగైదు సార్లు గెలిచి.. ఆయా నియోజకవర్గాల్లో తమదైన శైలిలో దూకుడు ప్రదర్శించి.. రికార్డులు బద్దలు కొట్టిన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. తొలిసారి లేదా రెండోసారి విజయం దక్కించుకున్నవారు స్వల్పంగా ఉన్నారు. అయితే.. ఒకప్పుడు సీనియర్లు టీడీపీలో చక్రం తిప్పారు.
ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉన్నసమయంలో సీనియర్ ఎమ్మెల్యేలు అన్నీ తామై వ్యవహరించారు. ఇలాంటి వారిలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, దేవినేని ఉమా.. వంటి హేమా హేమీలు మనకు కనిపిస్తారు. అయితే.. ఇప్పుడు వీరు ఎక్కడా కనిపించడం లేదు. అడపా దడపా.. దేవినేని ఉమా మాత్రం కనిపిస్తున్నా.. మిగిలిన సీనియర్లు.. వ్యాపారాలకు, సొంత పనులకు మాత్రమే పరిమితమై.. పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియనంతగా వ్యవహరిస్తున్నారు.
వీరంతా.. సందేహం లేదు.. పార్టీలోనే ఉన్నారు కానీ.. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేదు కాబట్టి సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే.. జూనియర్లుగా ఉన్న వారు ఇప్పుడు పార్టీలో చక్రం తిప్పుతున్నారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా సహా పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(రెండోసారి ఎన్నికయ్యారు), నిమ్మల రామానాయుడు(పాలకొల్లు నుంచి రెండోసారి విజయం సాధించారు), ఆదిరెడ్డి భవానీ(రాజమండ్రి సిటీ నుంచి తొలిసారి విజయం) వంటి వారు మాత్రం దూకుడుగా ఉన్నారు.
తరచుగా మీడియా ముందుకు రావడం, ప్రభుత్వంపై దూకుడుగా ఉండడం, అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వంటి విషయాల్లో వీరు మంచి మార్కులే వేసుకుంటున్నారు. అంటే.. దాదాపు సీనియర్లు మౌనం పాటిస్తే.. జూనియర్లు మాత్రం పార్టీ కోసం తపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక, ఇతర నేతలను చూస్తే.. పదవులు ఇచ్చినా.. ఇవ్వకున్నా కూడా.. వర్ల రామయ్య వంటివారు.. పార్టీ విషయంలో మనస్పూర్తిగానే పనిచేస్తున్నారు. దీంతో టీడీపీకి నికరంగా నిలబడే నాయకులు.. గతంతో పోల్చుకుంటే.. సీనియర్ల కన్నా.. జూనియర్లే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు పరిశీలకులు.
ఈ పరిణామం మంచిదే అయినా.. సీనియర్లు ఇంతగా మౌనం పాటించడం సరికాదనే సూచనలు కూడా వస్తున్నాయి. ఇక, చంద్రబాబు విషయాన్ని పరిశీలిస్తే.. పార్టీలో యాక్టివ్గా ఉన్నవారికే పదవులు ఇస్తున్నారు. మొహం చాటేసే నేతలకు చెయ్యిస్తుండడం గమనార్హం. మరి సీనియర్లకు `విషయం`ఇప్పటికైనా అర్ధమైతే.. బెటర్ అంటున్నారు పరిశీలకులు.