2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంతనే విషయం తెలిసిపోయింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 56 వేల 256 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. అందులో రెవెన్యూ వ్యయం 2 లక్షల 8 వేల 261 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. మూల ధన వ్యయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు, ద్రవ్యలోటు రూ.48,724 కోట్లుగా ప్రకటించారు. జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27 శాతంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ.. అప్పులు చేయనిదే పాలన కొనసాగే అవకాశం లేకప్పటికీ గతంలో కంటే ఎక్కువ అంచనాలతోనే బడ్జెట్ రూపొందించారు.
విద్య, వైద్య, వ్యవసాయంతో పాటు నవరత్నాల సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కింది. ఎన్నికల హామీల అమలుకే బడ్జెట్లో పెద్ద పీఠ వేశారు. ఈ సందర్భంగా విపత్తులు ఎదుర్కొన్నప్పుడే తమ సామర్థ్యం ఏమిటన్నది తెలుస్తుందని మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో వైఎస్ఆర్ రైతు భరోసాకు రూ.3,900 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకానికి రూ.1802 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలకు రూ.500 కోట్లు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు రూ.1800 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు, వ్యవసాయ విద్యుత్ రాయితీలకు రూ.5 వేల కోట్లు, వైఎస్సార్ పెన్షన్ కానుకకు రూ.18 వేల కోట్లు కేటాయించారు.
వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖకు రూ.11,387 కోట్లు, పాల ఉత్పత్తి, పశు సంవర్ధక శాఖకు రూ.1568 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.20,962 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాల కోసం రూ.10,201 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,014 కోట్లు, పాఠశాల విద్యకు రూ.27,706 కోట్లు, ఇరిగేషన్ ఫండ్ కట్రోల్కు రూ.11,482 కోట్లు, జనరల్ ఎకో సర్వీసెస్‌కు రూ.4,420 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.10,281 కోట్లు, పరిశ్రమలకు రూ.2775.17 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,109 కోట్లు, పర్యావరణ అటవీ శాఖకు రూ.685 కోట్లు, రవాణా రంగానికి రూ.9,617 కోట్లు, పౌరసరఫరాల శాఖకు రూ.3,719 కోట్లు కేటాయించారు.