- ఆంగ్ల బోధన తో అయోమయం..
- ఇంకోపక్క టీచర్ పోస్టుల్లో కోత
- 4,764 ఎస్జీటీ పోస్టుల రద్దు
నవ్యాంధ్రలో జగన్ సర్కారు విన్యాసాలకు విద్యావ్యవస్థ పతనావస్థకు చేరింది. నూతన విద్యావిధానం పేరిట పిల్లలను పాఠశాలలకు దూరం చేయాలని కంకణం కట్టుకుంది.
నిన్నమొన్నటివరకు చిన్నపిల్లాడు.. బుడి బుడి నడకల వయసు.. ఏవో కొన్ని పుస్తకాలు పట్టుకుని సమీపంలోని పాఠశాలకు వెళ్లిపోయేవాడు. పక్కనే పాఠశాల ఉండడంతో తల్లిదండ్రులు అందులోనే చేర్చేవారు.
పిల్లలు తమకు తాముగా వెళ్లిపోయేవారు. ఇది గతం.. ఇప్పుడు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో వీరంతా 2-3 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రాథమిక పాఠశాలల విలీన ప్రక్రియలో వేగాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది ఉన్నత పాఠశాలలకు 250మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలను విలీనం చేయాలని, వచ్చే ఏడాది ఒక కిలోమీటరు లోపువి చేయాలన్న నిర్ణయంతో ఒకటినుంచి ఐదో తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి మూడు, నాలుగు, ఐదో తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు.
ఆ దూరం పరిధిలో ఉన్నవి విలీనం చేయడంతో సుమారు ఆరు వేల ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిసిపోయాయి. అయితే ఇప్పుడు ఈ విలీనాన్ని కిలోమీటరు పరిధిలో ఉన్నవాటికీ వర్తింపచేయాలని నిర్ణయించారు.
ఈ ఏడాది నుంచే కిలోమీటరు దూరంలోనివీ చేసేయాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే సుమారు 13వేల పాఠశాలల్లోని 3,4,5 తరగతులు విలీనం అయిపోతాయి. వచ్చే ఏడాది ఈ దూరాన్ని మరింత పెంచి రెండుకిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలనూ విలీనం చేసేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
అంటే చిన్నపిల్లాడు పాఠశాలకు వెళ్లాలంటే కనీసం ఒక కిలోమీటరు నుంచి రెండు, మూడు కిలోమీటర్లు నడవాల్సిందే! ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితులూ ఏర్పడవచ్చు. దూరం పెరిగేకొద్దీ బడిమీద ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దూరం పెరిగేకొద్దీ తల్లిదండ్రులకు భారంగా మారుతుంది.
పాఠశాలలు సమీపానే ఉంటే గబుక్కున వారిని అక్కడకు పంపేసి.. పనులకు వెళ్లిపోయే పేద ప్రజలకు ఇప్పుడిక ఇబ్బందే. పాఠశాలలు దూరం కావడంతో తమ పిల్లలను ఉదయాన్నే దించి పనులకు పోవాలి. సాయంత్రం మళ్లీ తీసుకొచ్చేందుకు వెళ్లాలి. ఇదంతా పనులకు వెళ్లే తల్లిదండ్రులకు సమస్యగా మారి.. విద్యాభ్యాసానికే దూరం చేసే ప్రమాదముందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 34వేల ప్రాథమిక పాఠశాలలుండగా…వాటిలో అత్యధిక శాతాన్ని దశలవారీగా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.
కాలే పెనం మీంచి సరాసరి పొయ్యిలోకే..
వాస్తవానికి తొలి దశ విలీనంలోనే అనేక సమస్యలు ఎదురయ్యాయి. విద్యావ్యవస్థ మొత్తం గందరగోళంలో పడింది. ఉన్నత పాఠశాలకు 250మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులు తరలివచ్చేశాయి. ఆయా తరగతుల్లో ఉన్న విద్యార్థులూ వచ్చేశారు. కానీ ఆయా తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు మాత్రం రాలేదు. ఎందుకంటే వచ్చేందుకు ఉపాధ్యాయులే లేరు.
మరోవైపు ఇక్కడ ఉన్నత పాఠశాలల్లోనూ కొత్తగా వచ్చిన తరగతులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయుల్లేరు. అప్పటివరకు ఉన్న తరగతులు, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే అరకొరగా ఉండడంతో…ఇక కొత్త తరగతులు, కొత్తగా విలీనమైన విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల పాఠశాలల్లో ఈ సమస్య ఏర్పడింది. అదే సమయంలో కొత్తగా వచ్చిన తరగతులు, విద్యార్థులకు ఉన్నత పాఠశాలల్లో సరిపడా గదులు కూడా లేవు. వారిని ఎక్కడ కూర్చోబెట్టాలో తెలీక చాలామందిని మళ్లీ ప్రాథమిక పాఠశాలలకే తాత్కాలికంగా వెనక్కి పంపేసిన ఘటనలు ఉన్నాయి.
గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ జిల్లాలన్నింటిలోనూ ఈ సమస్యలు ఎదురయ్యాయి. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదు. అలసలు ఇలాంటి సమస్యలు వస్తాయని అధ్యయనం చేసిన పాపాన కూడా పోలేదు. ఒకరిద్దరు మూర్ఖ శిఖామణులు చెప్పడం.. అవగాహన లేని సీఎం ఒకే చేయడం.. ఇదే జరుగుతోంది..
కనీసం ఉపాధ్యాయుల రేషనలైజేషన్ అంటే…విద్యార్థులు, తరగతుల సంఖ్యను బట్టి టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ కూడా చేయలేదు. ఈ పరిస్థితుల్లో మళ్లీ కిలోమీటరు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని కూడా విలీనం చేస్తే విద్యావ్యవస్థ చతికిలపడిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏకోపాధ్యాయుడు…బహు ప్రదర్శనలు
ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడన్నా ఉండాలన్నది ఎప్పటినుంచో ఉన్న డిమాండ్. కానీ ఇప్పుడు ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు సంగతి దేవుడెరుగు! ఈ విలీన ప్రక్రియను ముందుకుతీసుకెళ్తే ఏకంగా ఒక పాఠశాల మొత్తానికి ఒకే ఉపాధ్యాయుడు ఉండే పరిస్థితి రానుంది. ఈ పరిణామంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడనున్నాయి. అంటే ఒక బడికి.. ఒక గురువే! ఆయనొస్తేనే తరగతులు నడుస్తాయి.
రెండు తరగతులున్నా పాఠాలు చెప్పేది ఒక్కరే. ఆయనొస్తేనే పాఠశాల నడుస్తుంది. లేకపోతే ఆ రోజు పాఠాలుండవు. వంద, వేయి కాదు.. ఏకంగా ఐదు వేల పాఠశాలలు ఇలా ఏకోపాధ్యాయగా మారిపోనున్నాయని అంచనా. అది కూడా తొలి విడత 250 మీటర్ల దూరంలోని ప్రాథమిక పాఠశాలలను కలిపితే ఏర్పడే పరిస్థితి.
ఇక కిలోమీటరులోపువి, ఆ తర్వాత రెండుకిలోమీటర్ల లోపువి కూడా విలీనం చేస్తే ఏకోపాధ్యాయ పాఠశాలలు 10వేలకు మించిపోతాయని అంచనా. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది నూతన విద్యాచట్టం పేర్కొంటోంది. ఇప్పుడు విలీనమైన, త్వరలో చేయనున్న ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40వరకే ఉంటుంది.
3, 4, 5 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసేశాక….ఇక ఒకటి, రెండు తరగతుల్లో మిగిలే విద్యార్థుల సంఖ్య ఇదే. 40మంది విద్యార్థులే అంటే ఒక ఉపాధ్యాయుడినే ఇస్తారు. అంటే రెండు తరగతులకు కలిపి ఒకరే ఉపాధ్యాయుడు. అతనే ఉపాధ్యాయుడు, అతనే హెడ్మాస్టరు, అతనే మధ్యాహ్న భోజనం పర్యవేక్షకుడు, అతనే పాఠశాల విద్యా శాఖ పెట్టిన పలు యాప్‌లకు ఫొటోలు పంపాల్సిన వ్యక్తి. అంటే ఒక ఉపాధ్యాయుడు అష్టావధానం చేయాల్సిందే.
రెండు తరగతులకు అన్ని అంశాలు బోధించడంతో పాటు ఇతర పనులనూ చక్కబెట్టాల్సి ఉంటుంది. దీంతో విద్యకు బలమైన పునాది పడాల్సిన ప్రాథమిక స్థాయిలోనే నాణ్యత కొరవడుతుంది. బాల్యం వికసించే సమయంలో, పసి మొగ్గలకు చదువుపై ఒక అవగాహన ఏర్పడే స్థాయిలోనే సరైన దిశానిర్దేశం లేకుండా పోతుందేమోనన్న ఆందోళన నెలకొంది.
ఎస్జీటీ పోస్టులు రహస్యంగా రద్దు
ఈ సమస్యలు చాలవన్నట్లు.. ప్రాథమిక పాఠశాలల్లో పాఠాలు చెప్పేందుకు భర్తీ చేయాల్సిన సెకండర్రీ గ్రేడ్ టీచర్ల పోస్టులను ప్రభుత్వం అడ్డగోలుగా రద్దుచేసేసింది. మొత్తం 4,764సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టుల్ని రద్దు చేసి ఉత్తర్వులను రహస్యంగా ఉంచేసిన వైనం బయటపడింది.
మోడల్ స్కూల్స్‌లో గతం నుంచీ పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్స్, టీజీటీలకు సర్వీస్ రూల్స్ రూపొందించి వారికి 010 పద్దు కింద జీతాలు చెల్లించాలని గతం నుంచీ ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి ఒక తలకిందులు మెలిక పెట్టింది. మోడల్ స్కూల్స్ టీచర్లకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇస్తున్న పద్దు కింద జీతాలు చెల్లిస్తామని.. అంటే వారు ప్రభుత్వంలోకి కొత్తగా వచ్చినట్లు అని లెక్కకట్టింది.
వారు కొత్తగా వస్తున్నారు కనుక…ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల్లో ఖాళీలున్న 13,555ఉపాధ్యాయ పోస్టుల్లో 4,764పోస్టుల్ని రద్దు చేసేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మోడల్ స్కూల్స్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం కాబట్టి…ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వమే డీఎస్సీ కింద నియమించినా వారికి జీతాలను వేరేగా ఇస్తున్నారు. అంతే తప్ప వీళ్లేమీ ప్రైవేటు ఉద్యోగులు కారు. లేకుంటే తాత్కాలిక ఉద్యోగులూ కారు.
మరి అలాంటప్పుడు వారి జీతాలను ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇచ్చినట్లే 010కింద ఇవ్వడం అన్న మార్పు తప్ప…కొత్తగా చేసిందేమీ లేదు. అక్కడ పద్దు కింద చూపించే జీతాలను ఈ పద్దుకింద చూపించి ఇస్తారు. కొత్తగా నియామకాలు లేవు. కొత్తగా క్రమబద్ధీకరణ లేదు. అయినా ప్రభుత్వం మాత్రం వారి జీతాల పద్దును మార్చుతున్నందున…వారిని ప్రభుత్వంలో చేర్చినట్లే అని లెక్కేసింది.