అసెంబ్లీని పాతతరం రాజకీయ నాయకులు ఓ దేవాలయంలా చూసేవాళ్లు. చట్ట సభలంటే ఎంతో గౌరవం చూపేవారు. శాసన సభ బయట కౌరవ సభల వంటివి పెట్టిన…వాటిని సభలోకి రానివ్వకుండా హుందాగా వ్యవహరించి సభా మర్యాదను కాపాడేవారు. కానీ, నేటి తరం రాజకీయ నాయకుల్లో అది టార్చ్ లైట్ వేసి వెతికినా కనిపించడం లేదు. ముఖ్యంగా వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన సభను కౌరవ సభగా మార్చేశారని విమర్శలు వస్తున్నాయి.
సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సభ్యుల వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత విషయాలపై విమర్శలు, సభకు ఏమాత్రం సంబంధం లేని సభ్యుల కుటుంబ సభ్యులపై విమర్శలు వంటి కొత్త ట్రెండ్ కు వైసీపీ నేతలే శ్రీకారం చుట్టారని విమర్శలు వస్తున్నాయి. టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడిపై సాక్ష్యాత్తూ సీఎం జగనే బాడీ షేమింగ్ అనే స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ సభ్యులు కూడా ఆయననే అనుసరిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని వైసీపీ సభ్యురాలు రోజా మరోసారి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా టీడీపీకి 160 సీట్లకు తగ్గకుండా వస్తాయని అచ్చెన్నాయుడు జోక్ చేస్తున్నారని, గట్టి చట్నీ వేసుకుని తింటే 160 కిలోల బరువు పెరుగుతారేమో కానీ, 160 సీట్లు రావని వ్యంగ్యంగా అచ్చెన్నాయుడును బాడీ షేమింగ్ చేశారు.
ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు దీటుగా స్పందించారు. రోజా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించాకే మహిళలకు ఆస్తిలో హక్కు లభించిందని గుర్తు చేశారు. ప్రజలు మోసపోయి ఓట్లు వేసి జగన్ కు అధికారం కట్టబెట్టారని, అందుకే ఏపీలో ఈ రోజు మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని అచ్చెన్న దుయ్యబట్టారు.