జగన్ పాలనలో టీడీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు, వేధింపులు పెరిగిపోతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులను అడ్డుపెట్టుకొని తమ కార్యకర్తలపై వైసీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. అయితే, కొన్ని ఘటనల్లో పోలీసులు ప్రభుత్వం అండ చూసుకొని రెచ్చిపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ చీరను పోలీసులు లాగేశారన్న ఆరోపణలపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఆ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేశ్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళలపై వైసీపీ నేతలు, పోలీసుల అరాచకాలు కొనసాగాయని, ఇది రాష్ట్రంలోని దుస్థితికి అద్దం పడుతోందని లోకేశ్ ఫైర్ అయ్యారు. మహిళలకి భద్రత కల్పించాల్సిన పోలీసులు వైసీపీ నేతల కోసం దుశ్శాసనపర్వాన్ని సాగించడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం పెద్దఅన్నలూరు గ్రామంలో వైసీపీ నేత అక్రమ లేఅవుట్ ని వేస్తున్నారు. దీంతో, దానిని అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ చీరను పోలీసులు లాగారు. ఈ క్రమంలోనే సభ్యసమాజం తలదించుకునేలా చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూములు ఆక్రమించిన వైసీపీ నేతపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ తగాదాలో పోలీసులు జోక్యం చేసుకోవడమే తప్పని అన్నారు.
మరోవైపు, శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావు ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వమే కారణమని చంద్రబాబు, లోకేశ్ ఫైర్ అయ్యారు. వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారని వారు ఫైర్ అయ్యారు. వెంకట్రావు మృతికి కారణమైన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలు కలుగుతున్నాయని మండిపడ్డారు.