అయినవారికి ఆకుల్లో…కానివారికి కంచాల్లో వడ్డించడం వైసీపీ నేతలకు కొత్తేం కాదు. తమకు అనుకూలంగా ఉండేవారికి మేళ్లు చేయడం…ప్రతికూలంగా ఉండేవారి కీడు చేయడం వారికి పరిపాటి. సినిమా టికెట్ల విషయంలో పవన్ పై జగన్ రివేంజ్ తీర్చుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, వైసీపీ నేతలు మాత్రం తాము రూల్స్ ప్రకారం వెళుతున్నామని, జీవో రావడం కొద్దిగా లేట్ అయిందని చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ విడుదలకు నాలుగు రోజుల ముందు ఏపీలో కొత్త రేట్ల జీవో రావడం కచ్చితంగా కాకతాళీయం మాత్రం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, టికెట్ రేట్లు పెంచిన ప్రభుత్వానికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీకి మేలు కలిగేలా ఈ నిర్ణయం తీసుకున్నారని, థియేటర్ల మనుగడ, ప్రజల వినోదం రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ ధరలు సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేశారని కొనియాడారు. జగన్, మంత్రి పేర్ని నానీకి, అధికారులకు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చిరు అన్నారు.
సినిమా టికెట్ల కొత్త ధరలు ఇవే
మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో…
నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.60, నాన్ ప్రీమియం టికెట్ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.100, నాన్ ప్రీమియం టికెట్ రూ.70.
స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ రూ.125, నాన్ ప్రీమియం టికెట్ రూ.100
మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ రూ.150, రిక్లయినర్ సీట్ టికెట్ రూ.250
మున్సిపాలిటీల్లో…
నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.50, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.30
ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.80, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.60
స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.100, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.80
మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.125, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250
నగర పంచాయతీలు-గ్రామ పంచాయతీల్లో…
నాన్ ఏసీ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.40, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.20
ఏసీ/ఎయిర్ కూల్డ్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.70, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.50
స్పెషల్ థియేటర్లు- ప్రీమియం టికెట్ ధర రూ.90, నాన్ ప్రీమియం టికెట్ ధర రూ.70
మల్టీప్లెక్సులు- రెగ్యులర్ సీట్ టికెట్ ధర రూ.100, రిక్లయినర్ సీట్ టికెట్ ధర రూ.250.
అయితే, ఈ టికెట్ల ధరలకు జీఎస్టీ అదనం. భారీ బడ్జెట్ సినిమాలు 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు. కానీ, రూ.100 కోట్లు, అంతకుమించి బడ్జెట్ ఉన్న చిత్రాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీంతోపాటు, ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకే ఈ టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుంది. చిన్న సినిమాలకు ఊరట కలిగించేలా అవి కూడా ఐదో షో వేసుకోవచ్చని అనుమతి ఇచ్చింది.