కేసీఆర్ వర్సెస్ కేంద్రం ఎపిసోడ్ లో భాగంగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఏ చిన్న అవకాశం లభించినా.. గులాబీ అధినేత బీజేపీ అండ్ కోను వదలకుండా విమర్శిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్ర గవర్నర్ మీదా ఆయన యుద్ధం ప్రకటించారు. తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాన్ని షురూ చేశారు. దీనిపై గవర్నర్ తమిళ సై ఇప్పటికే తప్పు పడుతూ ప్రకటన విడుదల చేయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మహిళా దినోత్సవ వేళ.. రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ‘నన్ను ఎవరూ భయపెట్టలేరు. నేను దేనికీ భయపడను. మహిళలకు నేటికీ సరైన గౌరవం లభించటం లేదు. అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి గౌరవం.. మర్యాద దక్కటం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తననెవరూ భయపెట్టలేరని.. తాను దేనికి భయపడనని స్పష్టం చేసిన ఆమె.. ఏ స్త్రీ తన స్వార్థం కోసం దేన్ని కోరుకోదని.. ప్రతిదీ తన కుటుంబం కోసమే కోరుకుంటుందన్నారు. స్త్రీలంతా ఆర్థిక స్వావలంబన కలిగి ఉండాలన్నారు. తమిళనాడు మహిళలకు.. తెలంగాణ స్త్రీలకు ఉన్న తేడా ఏమిటని ఈ మధ్యన తనను ఒక ఇంటర్వ్యూలో అడిగారని.. అందరూ ఒకేలా ఉంటారని తాను సమాధానం చెప్పినట్లు తెలిపారు.
తెలంగాణ సోదరిగా తాను ఇక్కడి మహిళల జీవన విధానాన్ని ఎంతగానో ఇష్టపడతానని.. మహిళలు ప్రతి నిమిషాన్ని అస్వాదించాలని.. తెలంగాణ మహిళల జీవన విధానాన్ని తాను ఎంతగానో ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి అవకాశం చేజారినా బాధపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా సాధించాలనే తపన ఎప్పుడూ ఉండాలన్న ఆమె చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారటమే కాదు.. తాజాగా తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని తన మాటలతో చెప్పేశారని చెప్పక తప్పదు.