ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం చాలాకాలంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గత నెల సీఎం జగన్ తో సినీ పెద్దలు, ప్రముఖుల భేటీ తర్వాత ఈ వివాదానికి పుల్ స్టాప్ పడబోతున్నట్టు సంకేతాలు వచ్చాయి. జగన్తో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు చర్చించిన తర్వాత..ఫిబ్రవరి నెలాఖరులోగా టికెట్ రేట్ల పెంపు, అదనపు షోలపై కీలక ప్రకటన రాబోతోందని చిరు, ప్రభాస్ తదితరులు వెల్లడించారు.
అయితే, ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యే సమయానికి కొత్త రేట్లు రాలేదు. దీంతో, పవన్ ను జగన్ టార్గెట్ చేశారని విమర్శలు వచ్చాయి. దీంతో, మార్చి 11న విడుదల కాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ రాధే శ్యామ్ నాటికి టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకుంటారా లేదా అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు టికెట్ల వ్యవహారంపై ప్రశ్న ఎదురైంది.
దీంతో, ఈ వివాదంపై స్పందించిన ప్రభాస్…కీలక వ్యాఖ్యలు చేశారు. రాధే శ్యామ్ చిత్రం విడుదలకు ముందే సినిమా టికెట్ల ధరలు పెరిగితే సంతోషమేనని ప్రభాస్ అభిప్రాయపడ్డారు. దీంతో, సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయని తన మనసులో మాట ప్రభాస్ పరోక్షంగా బయటపెట్టారని టాక్ వస్తోంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లు వసూళ్లు రాబట్టాలంటే టికెట్ ధరలు పెరగక తప్పదు.
దానికి తోడు బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు, ఐదో షోలకు కొద్ది రోజులపాటు అనుమతినిస్తేనే ఈ చిత్రాలు బ్రేక్ ఈవెన్ ను చేరుకుంటాయి. మరోవైపు, పవన్ ను టార్గెట్ చేసినట్లుగానే ఈ సినిమాకు కూడా థియేటర్ల యజమానులను తనిఖీలు, నిబంధనలు అంటూ టార్గెట్ చేస్తారా..లేక జగన్ తో ప్రభాస్ భేటీ అయిన కర్టసీతో వదిలేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, నరసాపురం ఎంపీ టికెట్ ను రెబల్ స్టార్ కృష్ణం రాజుకు ఇస్తామని, ఆయనతో రాయబారం చేయాలని ప్రభాస్ ను జగన్ కోరినట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆ రాజకీయ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోబోనని, పెదనాన్ననే డైరెక్ట్ గా అడగాలని బాహుబలి చెప్పినట్టు టాక్ వచ్చింది. మరి, ఈ విషయం నేపథ్యంలోనూ జగన్ రియాక్షన్ ఆసక్తికరంగా మారింది.