నేటి నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలా వద్దా ? అని టీడీపీ సభ్యులు మల్లగుల్లాలు పడిన సంగతి తెలిసిందే. సభకు వెళ్లినా తమకు మైక్ ఇవ్వరని, అందువల్ల వెళ్లినా ఉపయోగం లేదని కొందరు సభ్యులు అభిప్రాయపడగా….సభలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజాకోర్టులో నిలబెట్టాలని మరికొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన టీడీపీ సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ ప్రతులను చించేసిన టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు వెళ్లకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో, అసెంబ్లీ లాబీలోనే టీడీపీ సభ్యులు బైఠాయించారు. అంతకుముందు, ఉభయ సభలనుద్దేశించి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. అయితే, రాజ్యాంగ వ్యవస్థను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతేకాదు, తమ చేతిలో ఉన్న బడ్జెట్ ప్రతులను చించేశారు. ఈ గందరగోళం మధ్యే గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తుండగా…టీడీపీ సభ్యలు వాకౌట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. గత మూడేళ్లుగా సభలో టీడీపీ సభ్యులను, చంద్రబాబుతో పాటు, ఆయన కుటుంబసభ్యులను కూడా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇన్ని అవమానాలు ఎప్పుడూ ఎదుర్కోలేదని, విపక్ష సభ్యులు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వని దుస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధిగా తమ కర్తవ్య బాధ్యతలను నెరవేర్చడానికి సభకు హాజరవుతున్నామని తెలిపారు. సభలో మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్లబోమని, స్పీకర్ తమ్మినేని హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.సభా గౌరవాన్ని వైసీపీ సభ్యులు మంటగలుపుతున్నారని, అసెంబ్లీని కౌరవసభగా మార్చారని విమర్శించారు. ప్రభుత్వం బయట చేసే ప్రకటనలకు, సభ లోపల వ్యవహరించే తీరుకు పొంతనే లేదన్నారు.