గుంటూరు జిల్లాకు చెందిన కీలక రెడ్డి సామాజిక వర్గం తీవ్రస్థాయిలో టెన్షన్ పడుతోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఇలా టెన్షన్ పడడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా.. జగన్‌తోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకులే ఇలా ఉండడం గమనార్హం. వారే.. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో మధన పడుతున్నారు.
గత 2019 తర్వాత సీఎం జగన్ మంత్రి వర్గంలో చోటు కోసం ఈ ముగ్గురూ ప్రయత్నించారు. కానీ, జగన్ అవ కాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో పిన్నెల్లిని సంతృప్తి పరిచేందుకు.. ఆయనకు విప్‌గా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ.. ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణలో ఖచ్చితంగా పదవి దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. ఇక, మరోవైపు.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్లకు గతంలో జగన్ మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని.. ఆయన వర్గం ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి గతంలోనే ఈ హామీ నెరవేర్చాల్సి ఉన్నా.. ఆళ్లకు కూడా జగన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో కొన్నాళ్లు ఆళ్ల అలిగారనే వార్తలు వచ్చాయి. దీంతో జగన్ ఆయనకు ఏపీసీఆర్డీఏ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఎందుకో ఆళ్ల ఆ బాధ్యతలు తీసుకోలేదు. ఇక, ఆ తర్వాత కొంత కాలం యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత.. మాత్రం ఆయన సైలెంట్ అయ్యారు. ఇదంతా కూడా మంత్రి మండలిలో చోటు కోసమేనని తెలుస్తోంది.
ఇక, 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఆ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్సీనో.. రాజ్యసభకోసమో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని.. కూడా రాయబారాలు చేస్తున్నారు.అయితే.. ఈ ముగ్గురిలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది తేలలేదు. పైగా.. అసలు ఇస్తారో లేదో కూడా తెలియదు. దీంతో రెడ్డి వర్గం తెగ టెన్షన్ పడుతుండడం గమనార్హం.