ఆస్ట్రేలియా దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్(52) కన్నుమూశారు. థాయ్ లాండ్ లో విహార యాత్రలో ఉన్న వార్న్ తన విల్లాలో గుండెపోటుతో మృతి చెందాడని వార్న్ మేనేజ్ మెంట్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వార్న్ కు వైద్యులు చికిత్స అందించారని, కానీ, వార్న్ ను కాపాడలేకపోయారని వెల్లడించింది. వార్న్ మృతిపై మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపింది. వార్న్ మృతికి పలువురు సచిన్, కోహ్లీ, రోహిత్ శర్మ తదితర క్రికెటర్లతోపాటు పలువురు క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం గుండెపోటుతో ఆసీస్ లెజెండరీ వికెట్ కీపర్ రామ్ మార్ష్ (72) మరణించిన కొద్ది గంటల్లోనే వార్న్ కూడా మృతి చెందడంతో క్రీడాలోకం శోకసంద్రంలో మునిగింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు మార్ష్ కు నివాళులర్పిస్తూ ట్వీట్ చేసిన వార్న్…రాత్రి 8 గంటల సమయంలో గుండెపోటుతోనే మరణించడం కలచివేస్తోంది. అయితే, వార్న్ గుండెపోటుతోనే మరణించాడని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
15 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా జట్టుకు సేవలందించిన వార్న్…145 టెస్టుల్లో 708 వికెట్లు,194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 1000కి పైగా వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. ఆస్ట్రేలియా జట్టు 90, 2000వ దశకాల్లో సాధించిన అనేక విజయాల్లో వార్న్ పాత్ర మరువలేనిది. 2008లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించిన వార్న్…అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన యువ క్రికెటర్లతో కలిసి కప్ ఎగురేసుకుపోయాడు. ఐపీఎల్ లో కోచ్ గానూ చాలాకాలం పనిచేశాడు.