వివేకా మర్డర్ కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక వాంగ్మూలాలను రాబట్టిన సీబీఐ అధికారులు…తదుపరి చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇప్పటికే, ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల పేర్లు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాంగ్మూలంలో చాలామంది అవినాశ్ పేరు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే త్వరలోనే అవినాశ్ ను అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు రెడీ అవుతున్నారని చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులకు అవినాశ్ రెడ్డి షాకిచ్చినట్లు తెలుస్తోంది. సీబీఐ అధికారుల నుంచి విచారణ నోటీసులు తీసుకునేందుకు అవినాశ్ రెడ్డి నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. సీబీఐ విచారణకు హాజరుకావాలని అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రికి నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం పరిధిలోని స్పెషల్ క్రైమ్స్ మూడో విభాగం అధికారుల ప్రయత్నించారని తెలుస్తోంది.
వారు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడంతో కడప జిల్లా కోర్టును సీబీఐ అధికారులు ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కోర్టు అనుమతితో ఈరోజు మరోసారి వారికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాని తెలుస్తోంది. మరోవైపు, ఈ వ్యవహారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసును న్యాయంగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని, ఈ హత్యతో అవినాశ్ కు ఎలాంటి సంబంధం లేదని బాలినేని తేల్చేశారు. అవినాశ్ ను విచారణ చేయాల్సిన అవసరం లేదని, ఈ కేసు దర్యాప్తు తప్పుదోవ పడుతోందని అనుమానాలు వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ 160 స్థానాల్లో గెలుస్తుందని బాలినేని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్ న్యాయనిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అయితే, అవినాశ్ తప్పు చేయకుంటే విచారణకు హాజరై అధికారులకు సహకరించాలని, అలా కాకుండా నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడం ఏమిటని విమర్శలు వస్తున్నాయి. వివేకా హత్యతో అవినాశ్ కు సంబంధం లేదని బాలినేని ఎలా తేలుస్తారని, అది నిర్ధారించాల్సింది సీబీఐ అధికారులని అంటున్నారు. అవినాశ్ నేరస్థుడో కాదో బాలినేని తేల్చేశారని, ఇక సీబీఐ అధికారులు కేసు క్లోజ్ చేయవచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.