అమరావతి రాజధాని, సీఆర్డీఏ రద్దు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మంగళగిరిలో సర్పంచ్ ల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు…హైకోర్టు తీర్పును స్వాగతించారు. ఇది, అమరావతి రైతులు సాధించిన విజయం అని, 5 కోట్ల మంది ఆంధ్రుల విజయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులను, ప్రజలను అభినందించిన చంద్రబాబు…అమరావతి అన్ని వర్గాలు, కులాలు, మతాల ప్రజలదని స్పష్టం చేశారు.
33 వేల ఎకరాల భూమిని రైతులు ల్యాండ్ పూలింగ్ విధానంలో ప్రభుత్వానికి ఇవ్వడం ఓ రికార్డు అని, ఆ ఘనత ఏపీ ప్రజలదేనని గర్వంగా వెల్లడించారు. వారసత్వ భూమి అంటే రైతులకు చాలా సెంటిమెంట్ అని, కానీ, ఆ సెంటిమెంట్ ను కూడా పక్కనబెట్టి ప్రజలు అన్ని వేల ఎకరాలు ఇవ్వడం నిజంగా గొప్పవిషయమని చెప్పారు. అమరావతి శ్మశానం, ఎడారి, ముంపునకు గురవుతుంది, వరదలు వస్తాయి అని విమర్శించారని, కానీ, చెన్నై, హైదరాబాద్ లతో పోలిస్తే నిర్మాణాలకు అమరావతి భూమే గట్టిదని నిపుణులు చెప్పారని గుర్తు చేశారు.
జగన్ వంటి దుర్మార్గులు పాలకులుగా వస్తే రైతులు ఇబ్బంది పడతారనే ముందు చూపుతోనే సీఆర్డీయే చట్టం తెచ్చామని, కానీ, జగన్ మూడు ముక్కలాట ఆడి….ఆ బిల్లును రద్దు చేశారని మండిపడ్డారు. అయితే, అమరావతి రైతులు తమ హక్కుల కోసం ఉద్యమించారని, అందుకే నేడు వారికి న్యాయం జరిగిందని చెప్పారు. 807 రోజులుగా పోరాడుతున్న రైతులపై జగన్ పలు రకాలుగా కక్షసాధించి హింసించారని ఫైర్ అయ్యారు.
గడిచిన మూడేళ్లలో వైసీపీ చేసిందేమీ లేదని, రాబోయే రెండేళ్లలో కూడా చేయబోయేదేమీ లేదని అన్నారు. అమరావతిపై విషం కక్కిన వైసీపీ నేతలు చరిత్రహీనులని విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు వైసీపీ నేతలకు లేదని, తమను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడితే భయపడే పరిస్థితులు లేవని, ప్రజలు తిరగబడితే పోలీసులు ఏమీ చేయలేరని హెచ్చరించారు.