గడిచిన కొద్ది రోజులుగా సంచలనంగా మారిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి వేళ్లన్నీ కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వైపు చూపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు బయటకు వచ్చిన వాంగ్మూలాల్లో అత్యధికం ఆయన పేరును ప్రస్తావించటం తెలిసిందే. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ.. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 207 మందిని విచారించి.. 146 మంది వాంగ్మూలాల్ని రికార్డు చేసింది.
ఈ సందర్భంగా ఎక్కువ మంది వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారన్న ప్రచారం చేసింది అవినాశ్ రెడ్డినే అని.. ఆయనతో పాటు మరికొందరు కలిసి పదే పదే ఇదే మాట చెప్పినట్లుగా చెబుతున్నారు. బెడ్రూం.. బాత్రూంలలో ఉన్న రక్తపు మరకల్ని శుభ్రం చేయించటంతో పాటు.. వివేకా గాయాలకు కుట్లు వేయించి.. కట్లు కట్టించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. వివేకా భౌతికకాయాన్ని ఫ్రీజర్ బాక్సులో పెట్టేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొనటం తెలిసిందే.
మరోవైపు అవినాశ్ రెడ్డి అమాయకుడని.. ఆయన మీద ఆరోపణలు చేయటానికి నోరెలా వచ్చిందన్న మాట ఆ మధ్యన సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక కన్ను మరో కన్నును పొడుచుకుంటుందా? అన్న సీఎం జగన్ మాటల్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని చెబుతున్నారు.
రెండు వారాల క్రితం ఢిల్లీ నుంచి కడపకు వచ్చిన సీబీఐ డీఐజీ చౌరాసియా కొందరు కీలక వ్యక్తుల్ని ప్రశ్నించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. వైఎస్ అవినాశ్ రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరికి సెక్షన్ 161 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వనున్నట్లుగా సమాచారం. ఇవాళ లేదంటే రేపు (గురు.. శుక్రవారాల్లో) పులివెందులలో అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించే వీలుందంటున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దస్తగిరి అప్రూవర్ గా మారిపోవటం.. సీబీఐకు కీలకమైన రెండో వాంగ్మూలం ఇవ్వటంతో పాటు పలువురు అవినాశ్ పాత్రను ప్రస్తావిస్తున్న వేళ.. ఆయనకు నోటీసులు ఇస్తారంటున్నారు. ఈ వాదనకు తగ్గట్లే.. రెండు రోజులుగా అవినాశ్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ.. ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీయాలన్న ప్లాన్ వేస్తున్నట్లుగా వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. దీంతో.. ఆయనకు సీబీఐ నోటీసులు ఇచ్చి.. విచారణకు హాజరు కావాలని కోరే వీలుందన్న మాట బలంగా వినిపిస్తోంది.