మంచు ఫ్యామిలీ చుట్టూ రోజుకో కొత్త వివాదం రాజుకుంటోంది. మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్ మెంట్ చోరీ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు కుటుంబం దగ్గర పదేళ్లుగా హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేసిన నాగ శ్రీనుపై అనుమానం ఉందని విష్ణు మేనేజర్ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత మంచు ఫ్యామిలీపైనే నాగ శ్రీను సంచలన ఆరోపణలు చేస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం దుమారం రేపింది.
తనను మోహన్ బాబు, విష్ణు కులంపేరుతో దూషించారని, తన తల్లిని అవమానించారని నాగ శ్రీను ఆరోపించడంతో వ్యవహారం సీరియస్ అయింది. అయితే, నాగ శ్రీను చేసిన ఆరోపణలను మంచు ఫ్యామిలీ తరఫు నుంచి ఎవరూ ఖండించకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తమ మనోభావాలను మంచు ఫ్యామిలీ దెబ్బ తీసిందని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
మంచు ఫ్యామిలీ తమ కులాన్ని దూషించిందని నాయీ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఆరోపించారు. తక్షణమే నాయీ బ్రాహ్మణులకు మంచు ఫ్యామిలీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అలా చెప్పకుంటే మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. అయితే, ఈ హెచ్చరికలపై కూడా మంచు మోహన్ బాబు, విష్ణులు స్పందిచకపోవడం విశేషం.
కాగా, అంతుకుముందు మోహన్‌బాబు, విష్ణుల పేరిట ఏపీలో సాగుభూమి లేని నిరుపేదలకు కేటాయించే దరఖాస్తు పట్టాలు మంజూరు కావడం తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే.. ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ వివరాలు రావడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని స్థానిక తహశీల్దార్ వివరణనిచ్చారు. ఈ వివాదంపై కూడా మోహన్ బాబు, విష్ణు స్పందించలేదు.