వివేకా మర్డర్ కేసులో కీలక వాంగ్మూలాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వైనం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి మొదలుకొని…వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం వరకు…అన్ని చేతులు వైసీపీ నేతలవైపే చూపిస్తున్నాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ హత్య వెనుక జగన్ స్కెచ్ ఉందని, అందుకే నిందితులను తప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే గతంలో సీబీఐ అధికారులకు వివేకా భార్య సౌభాగ్యమ్మ ఇచ్చిన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తం మూడు సార్లు వాంగ్మూలమిచ్చిన సౌభాగ్యమ్య…సీబీఐ అధికారుల ఎదుట పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ కంపెనీలన్నీ తన భర్త పేరిటే ఉన్నాయని,ఆ బోర్డుల్లో ఆయనే డైరెక్టర్గా కొనసాగారని తెలిపారు. వివేకా వాటాదారుడిగా ఉన్న కంపెనీల వివరాల్ని సీబీఐకి సమర్పించారు.
అంతేకాకుండా, వివేకాకు సంబంధించిన మరో కీలక విషయాన్ని ఆమె వెల్లడించారు. తన భర్త కళ్లద్దాలు లేకుండా రాయలేరని తెలిపారు. మర్డర్ స్పాట్ లో దొరికి కళ్లద్దాలు ఏ షాపులో కొన్నవో కూడా అధికారులకు ఆమె వెల్లడించారు. దీంతో, ఆ కళ్లద్దాలకు, వివేకా మర్డర్ కు ఏమైనా లింకుందా అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
ఇక, ఈ కేసులో అప్రువర్ గా మారిన దస్తగిరి తన భర్త వద్ద డ్రైవర్గా పనిచేసేవాడని, అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో డబ్బులు దస్తగిరి అప్పుగా తీసుకునేవాడని వెల్లడించారు. 16 డిసెంబరు 2018న తన సోదరి వివాహం కోసమని తన వద్ద రూ. 95 వేలు తీసుకున్నాడని, నోట్ రాయించి ఇచ్చాడని, సాక్షిగా షేక్ ఇనయతుల్లా సంతకం కూడా చేశాడని పేర్కొన్నారు. ఆ డబ్బు ఇప్పటి వరకు తిరిగి వెనక్కి ఇవ్వలేదని అన్నారు. తన భర్త వివేకా నుంచి దస్తగిరి రూ. 50 వేలు తీసుకున్న విషయం, ఆ సొమ్మును అతడు సునీల్ యాదవ్కు ఇచ్చిన విషయం తనకు తెలియదని వాంగ్మూలమిచ్చారు.