అంచనాలకు మించినట్లుగా వ్యవహరించటంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. మంచి వ్యూహకర్తగా పేరున్న చంద్రబాబు.. ఫ్లోలో తప్పులు చేస్తుంటారు. కేసీఆర్ వరకు వచ్చేసరికి మాత్రం అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.
అమరావతి కలను ఆవిష్కరించే సమయంలో చంద్రబాబు.. హఠాత్తుగా దర్శక ధీరుడు రాజమౌళిని తెర మీదకు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా జరిగిన ఎపిసోడ్ ను మళ్లీగుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా చంద్రబాబు మాత్రమే కాదు.. రాజమౌళి సైతం బద్నాం అయ్యారు.
ఎందుకిలా? అంటే.. అమరావతి లాంటి గంభీరమైన వ్యవహారంలో బాహుబలి సెట్ బాగా వేసిన రాజమౌళి.. ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటంలో ఆయన్ను ఆలోచనలు ఇవ్వాలని కోరటం. మరింత వివరంగా చెప్పాలంటే.. ఒక సీరియస్ అంశంలోకి వినోద రంగానికి సంబంధించిన ప్రముఖుడ్ని భాగస్వామ్యం చేయటాన్ని సామాన్యులు హర్షించలేకపోయారు. వారి లాజిక్ కు సైతం అందలేదు. సినిమా వాళ్లను ఎంతవరకు వాడుకోవాలన్న విషయంలోనూ చంద్రబాబు లెక్కలు ఎప్పటికప్పుడు తప్పుతూనే ఉన్నాయన్నది మర్చిపోకూడదు.
అదే కేసీఆర్ ను తీసుకుంటే.. జాతీయ రాజకీయాలను టార్గెట్ చేసుకున్న ఆయన.. సినీ నటుడు.. భిన్నమైన రాజకీయ ఎజెండా స్పష్టంగా ఉన్న ప్రకాశ్ రాజ్ ను దగ్గరకు తీసుకోవటం.. ఆయన్నుతన వెంట తీసుకెళ్లటం లాంటివి చేస్తున్నారు.
అమరావతి ఎపిసోడ్ లో రాజమౌళిని ఎంట్రీ ఇచ్చినప్పుడు వచ్చిన స్పందనకు.. కేసీఆర్ – ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ కు వచ్చిన రియాక్షన్ కు తేడా ఇట్టే అర్థమైపోతుంది. ప్రకాశ్ రాజ్ కు జాతీయ స్థాయిలో తనదైన రాజకీయాల్ని చేసే వ్యక్తులు.. సంస్థలు.. శక్తులతో చక్కటి అసోసియేషన్ ఉంది.
మేధావిగా గుర్తింపు ఉంది. ముక్కుసూటి మనిషిగా.. చుట్టూ ఉన్న వారికి మంచి జరగాలన్న లక్ష్యంతో ఆయన పని చేస్తారన్న పేరుంది. అన్నింటికి మించి.. మోడీ సిద్ధాంతాలకు మహా వ్యతిరేకన్న ట్యాగ్ ఉంది.
మోడీకి పోటీగా జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టే కేసీఆర్ లాంటి వారికి ప్రకాశ్ రాజ్ ఒక ఆయుధం అవుతారు. చాలా సంస్థలతో ఆయన కారణంగా యాక్సిస్ దొరుకుతుంది. తన వాదాన్ని వారి చేత.. వారి వాదనల్ని తాను బయటకు వ్యక్తీకరించటం ద్వారా.. మోడీ వ్యతిరేకుల్ని ఒకచోటకు చేర్చే ప్రక్రియ వేగవంతం కావటానికి సాయం చేస్తుంది. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా కేసీఆర్ కు పక్కనే ఉన్న ప్రకాశ్ రాజ్ వల్ల ఎంత సౌలభ్యమన్న విషయాన్ని గులాబీ బాస్ గుర్తించకపోలేదు.
జాతీయ స్థాయిలో కొందరి వ్యక్తుల మీద కొన్ని ముద్రలు ఉంటాయి. ఉదాహరణకు కేసీఆర్ పేరు చెప్పినంతనే.. ఆయన్ను శక్తివంతుడిగా.. రాజకీయ వ్యూహకర్తగా ఒప్పుకునే వాళ్లు సైతం.. ఆయన్నో నమ్మకస్తుడైన మిత్రుడిగా మాత్రం అంగీకరించటానికి ఇష్టపడరు. ఆయన మీద చాలానే అపనమ్మకాలు ఉన్నాయి.
అదే ప్రకాశ్ రాజ్ విషయానికి వస్తే.. జాతీయ స్థాయిలో ఆయనకో ఇమేజ్ ఉంది. అది కేసీఆర్ కు ఒకస్థాయి వరకు మేలు చేసేదే. ఆ మాటకు వస్తే.. కేసీఆర్ కు ఎప్పుడు ఏ సమయంలో ఎవరిని వాడుకోవాలో? ఎప్పుడు ఎవరిని తన పక్కన ఉంచుకోవాలన్న విషయం మీద చక్కటి అవగాహన ఉంది. చంద్రబాబు మాదిరి కాకుండా.. కేసీఆర్ సందర్భానికి అనుగుణంగా తన టీంను మార్చేస్తుంటారు. కోర్ టీం ఉన్నా.. తెర వెనుకే ఉంటారే తప్పించి ముందుకు రారు. వచ్చే ప్రయత్నం చేస్తే.. తోక కత్తిరించటానికి ఆయన దగ్గర పదునైన కత్తి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
అందుకే ఆయనకు అత్యంత ఆప్త మిత్రులు ఉండరు.. అలా అని దారుణమైన శత్రుత్వం ఉన్న వారు ఉండరు. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ కూడా అలాంటి వాడే. ఆయన ప్రయాణంలో ప్రకాశ్ రాజ్ ఒక మజిలి. మరి.. ప్రకాశ్ రాజ్ సంగతేమంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. మోడీ లాంటి శక్తివంతుడైన అధినేతను ఢీ కొట్టే సత్తా.. మెదడులో కాస్తంత గుజ్జు.. కన్వీన్స్ అయ్యేలా మాటలు చెప్పే గుణం ఉన్న నేత కావాలి.
అలాంటి లక్షణాలు కేసీఆర్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఆయన్ను మోడీ మీద గురి పెట్టే విషయంలో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు కేసీఆర్ – ప్రకాశ్ రాజ్.. ఇద్దరు ఇద్దరికి అవసరమే. వారి.. వారి స్థాయిల్లో. ఇప్పటికైతే విన్ టు విన్ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇద్దరు కలిసి జర్నీ చేస్తున్నారు. అప్ గ్రేడ్ వేళ.. ఏం జరుగుతుందన్నది కాలమే డిసైడ్ చేయాలి.