సినీ రంగంలో ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంటారు….ఎవరైనా హీరో, హీరోయిన్లు హిట్ పెయిర్ గా రెండు, మూడు సినిమాల్లో నటిస్తే చాలు రిలేషన్ షిప్ అంటూ ప్రచారం చేస్తుంటారు. బయట ఏదైనా ఫంక్షన్లోనో, పార్టీలోనో , రెస్టారెంట్లోనో జంటగా కనిపిస్తే చాలు…లవర్స్ అని ట్యాగ్ వేస్తుంటారు. ఈ కోవలోనే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, క్యూటీ బ్యూటీ రష్మిక మందన్నల మధ్య సమ్ థింగ్ …సమ్ థింగ్ అంటూ ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది.
గీత గోవిందం సినిమాలో కలిసి నటించినప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారన్న పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతేకాదు, కన్నడ హీరో రక్షిత్ శెట్టికి రష్మిక బ్రేకప్ చెప్పడానికి కూడా రౌడీ హీరోతో రిలేషన్ షిప్పే కారణమంటూ ఊహాగానాలు వినిపించాయి. ఇక, ఇటీవల కాలంలో వీరిద్దరూ జంటగా బయట కూడా కనిపిస్తుండడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తాజాగా హల్ చల్ చేస్తున్నాయి.
అయితే, ఈ పుకార్లపై స్పందించిన విజయ్ దేవరకొండ…ఇదొక పనికిమాలిన వార్త అంటూ కొట్టిపారేశాడు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక కూడా ఈ రిలేషన్ షిప్ పుకార్లపై స్పందించింది. ఆ వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని, ఆ పుకార్లు తనకు కొత్తేమీ కాదని రష్మిక చెప్పింది. ఇలాంటి వార్తలను విని నవ్వుకోవడం అలవాటయిందని, వీటిని పట్టించుకునే టైం కూడా తనకు లేదని చెప్పిందీ కన్నడ బ్యూటీ.
అయితే, వీరిద్దరి రిలేషన్ షిప్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం గట్టిగా ఫోకస్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఏ చిత్రంలోనూ నటించడం లేదని, అటువంటపుడు ముంబైలో చట్టాపట్టాలేసుకొని ఎందుకు తిరుగుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఏదైనా పార్టీనో…ప్రోగ్రామో అనుకోవడానికి వారిద్దరితోపాటు ఇతర సెలబ్రిటీలు కూడా ఎవరూ లేరు కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరి, ఆ ప్రశ్నలకు రౌడీ హీరో, క్రష్మిక ఎలా రియాక్టవుతారో వేచి చూడాలి.