ఉక్రెయిన్ పై యుద్ధంలో వెనక్కు తగ్గేదేలేదంటూ రష్యా కఠినంగా వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్ సైనిక శక్తిని, సైన్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నేడు దాడులు ముమ్మరం చేసింది. క్యివ్ ను స్వాధీనం చేసుకోవడానికి భారీ సంఖ్యలో బలగాలను రంగంలోకి దించింది రష్యా. దానితోపాటు ఇతర నగరాలను కూడా చేజిక్కించుకునేందుకు రష్యా బలగాలు భీకర దాడులు జరుపుతున్నాయి. అయితే, ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా మృత్యువాతపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఒకిట్రికా నగరం వద్ద రష్యా బలగాలు జరిపిన ఓ రాకెట్ దాడిలో ఉక్రెయిన్ కు చెందిన 70 మంది సైనికులు మృతి చెందారు. వారితోపాటు సంఖ్యలో సాధారణ పౌరులు కూడా బలయ్యారరు. ఐదు రోజులు యుద్ధంలో ఏడుగురు చిన్నారులు సహా 102 మంది సాధారణ పౌరులు బలైనట్టు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఉక్రెయిన్పై రష్యా చేసిన దాడుల్లో భారత్కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన నవీన్ రష్యా సైనిక దాడిలో మరణించాడని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది. ఓ సూపర్ మార్కెట్ దగ్గర నిత్యావసర వస్తువులు కొనేందుకు క్యూలో నిల్చున్న వారిపై రష్యా సైనికులు హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో క్యూలో నిలుచున్న నవీన్ కూడా చనిపోయాడు.
వైద్య విద్య కోసం ఉక్రెయిన్ కు వెళ్లిన నవీన్ యుద్ధ నేపథ్యంలో మరణించడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని క్యివ్ నుంచి భారతీయులందరూ వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం సూచన జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, భారత జాతీయులు అందరూ రైళ్లు లేదా ఇతర మార్గాలలో ఈ రోజే కీవ్ ను వీడాలని కోరింది.
మరోవైపు, ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ సాయాన్ని ప్రధాని మోదీ కోరారు. ఉక్రెయిన్ లో సుమారు 10,000 మంది వరకు భారతీయులుండగా…ఇప్పటికి 4,000 మంది వెనక్కి వచ్చేసి ఉంటారని అంచనా. ఆపరేషన్ గంగాలో భాగంగా భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఫోర్స్ సీ-17 విమానాలు రంగంలోకి దిగాయి. ఇప్పటిదాకా భారతీయులను తరలిస్తున్న ఎయిర్ ఇండియా విమాన సామర్థ్యం 200-240. అదే, సీ-17 విమానం అయితే గంటకు 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ట్రిప్ నకు 1000 మందిని తరలించగలదు.