ప్రస్తుతం ఏపీలో రెండే రెండు టాపిక్ లపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ రెండు టాపిక్ లలో ఒకటి జగన్ చేస్తున్న అప్పులు…రెండోది వివేకా మర్డర్ కేసు. ఈ రెండు విషయాలపై రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోందనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఇక, కార్పొరేషన్ల పేరుతో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని ఖజానాలోటును భర్తీ చేయాలని భావించిన జగన్ కు బ్యాంకర్లు హ్యాండ్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై కేంద్రం చాలా కాలం క్రితమే ఫోకస్ పెట్టింది. ఏపీలో కార్పొరేషన్ల ముసుగులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అక్రమాల నిగ్గుతేల్చేందుకు కేంద్రం ప్రాథమిక స్థాయిలో వివరాలను సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు గతలోనే సంచలన ఆదేశాలు జారీచేసింది
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అభివృద్ధి కంటే అప్పులు తీసుకుని రావడానికి ఉపయోగించుకుంటున్నారని జగన్ సర్కార్ పై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోందని, భవిష్యత్తులో మద్యంపై వచ్చే ఆదాయాన్ని పూచీకత్తు కింద పెట్టి రుణాలు తీసుకోవాలని చూడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ను అడ్డుపెట్టుకొని అప్పులు చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కాకుండా అప్పుల్లో నెంబర్ వన్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
ఆస్తులను అమ్ముకోవడం చూస్తుంటే రాష్ట్రం అధోగతి పాలైపోతోందని, ఏపీలో ఒక్కొక్కరిపై ఆరు లక్షల పై చిలుకు అప్పు భారం పడిందన్నారు.
ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. ఎంపీకే రక్షణ లేకుండాపోయిందని రఘురామనుద్దేశించి వ్యాఖ్యానించారు.రహదారులపై గుప్పెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం వేయలేకపోతోందని, రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదనేది నిజం కాదని స్పష్టం చేశారు.