సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో నారాయణ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా కొడాలి నాని షాకింగ్ కామెంట్లు చేశారు. సీపీఐ నారాయణ ఓ వింత జంతువు అని, నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని కొడాలి నాని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. వివేకా హత్యలో వైఎస్ జగన్ కుటుంబం పాత్ర ఉందని నారాయణ ఆరోపిస్తున్నారని, బిగ్ బాస్ షో వ్యభిచార కొంప అంటున్నారని కామెంట్లు చేశారు.
2 ఎంపీ సీట్లు ఉన్న సీపీఐ జాతీయ పార్టీ అని…నారాయణ జాతీయ నాయకుడని నాని ఎద్దేవా చేశారు. తమకు 28 మంది ఎంపీలు ఉన్నారని నాని చెప్పారు. ఎవరైనా పది మందిని చంపి జగన్ మీద తోసేయొచ్చని నారాయణ వంటి నేతలు ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోందంటూ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, భీమ్లా నాయక్ వివాదంపై కూడా నాని స్పందించారు. ఫిబ్రవరి 25వ తేదీన జీవో ఇస్తున్నాం… సినిమా రిలీజ్ చేసుకోండి అని ప్రభుత్వం గానీ, వైసీపీ గానీ చెప్పదని అన్నారు.
న్యాయపరమైన అడ్డంకులు లేకుండా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, ఈ లోపు మంత్రి గౌతమ్ చనిపోవడంతో నాలుగు రోజులు ఆలస్యం అయ్యిందని సమర్థించుకున్నారు. సినిమా ఆడకపోతే పవన్ కల్యాణ్‌ను నష్టం ఉండదని, పవన్‌కు తన రెమ్యునరేషన్ అందిందని అవమానకర రీతిలో మాట్లాడారు. చిరంజీవిని జగన్ గౌరవించలేదని పవన్ అన్నారని, కానీ, చిరంజీవిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి గౌరవించిన విషయాన్ని పవన్ మర్చిపోయారా? అని నాని ప్రశ్నించారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ ను రెచ్చగొడుతున్నారని, వారి ట్రాప్ లో పడొద్దని పవన్ కు నాని సూచించారు.