జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాను వైసీపీ సర్కార్ టార్గెట్ చేసిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ లోకేష్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సహా పలువురు రాజకీయ ప్రముఖులు బాసటగా నిలిచారు. అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ క్రమంలోనే తాజాగా తన తమ్ముడు పవన్ కు నటుడు, నిర్మాత నాగబాబు మద్దతునిచ్చారు.
కల్యాణ్ బాబు సినిమాలపై ప్రభుత్వం వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నాగబాబు ఆరోపించారు. ‘వకీల్ సాబ్’ నుంచి భీమ్లా నాయక్ వరకు జరిగిన పరిణామాలు ఆ విధంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాల్ని ‘రిపబ్లిక్’ చిత్ర వేడుకలో కల్యాణ్ బాబు బాహాటంగా విమర్శించారని, దీంతో, పవన్ ను వైసీపీ టార్గెట్ చేసిందని ఆరోపించారు.
తనపై కోపం ఉంటే తన మీదే తీర్చుకోవాలని, ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టవద్దని కల్యాణ్ బాబు ఓపెన్ గా మాట్లాడారని గుర్తు చేశారు. ఫిబ్రవరి 20న కొత్త రేట్లపై జీవో వస్తుందన్నారని, భీమ్లా నాయక్ సినిమా 25న విడుదల అని ప్రకటన రాగానే ఆ జీవోను ఆలస్యం చేశారని ఆరోపించారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ అనే హీరోని టార్గెట్ చేశారని క్లియర్ కట్ గా అర్థం అవుతోందన్నారు. కల్యాణ్ వంటి హీరోకి ఈ విధంగా జరిగితే, సామాన్యుల పరిస్థితి ఏమిటని నాగబాబు ప్రశ్నించారు.
ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు మాత్రం టికెట్ రేట్లపై స్పందించారని, కల్యాణ్ బాబుకు ఇండస్ట్రీ పెద్దలు మద్దతుగా మాట్లాడకపోవడం దురదృష్టకరమని అన్నారు. తోటి హీరోలు, దర్శకులు, నిర్మాతలు మాట్లాడితే చంపేస్తారా? అని నాగబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. అదే సమయంలో వాళ్ళ భయాలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకోగలమని కూడా నాగబాబు అన్నారు. ‘భీమ్లా నాయక్’ మాసివ్ హిట్ అయ్యింది కాబట్టి సరిపోయిందని, లేదంటే నిర్మాత – పంపిణీదారులు నష్టపోయేవారని అన్నారు. ఇదే సమస్య మరొకరికి ఏ ప్రభుత్వం ద్వారా వచ్చినా? తాను , తన తమ్ముడు కల్యాణ్ అండగా ఉంటామనిన్నానారు. ‘మీరు మమ్మల్ని వదిలేసినా… మీకు మా సపోర్ట్ ఉంటుంది’ అని చిత్ర పరిశ్రమ ప్రముఖులకు నాగబాబు చెప్పారు.