- పీఎం సాయానికి సీఎం కలరింగ్
- ఖాతాల్లో నగదు పడిన రెండో రోజు..
- ఇప్పుడే జమ చేస్తున్నట్లు షో
- కేంద్రం సొమ్ముకు జగన్ పటాటోపం
ఆ సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది. అది ప్రధానమంత్రి చేస్తున్న సాయం. పైగా రైతుల ఖాతాలకు నేరుగా చెల్లింపులు జరిపి రెండు రోజులైంది. అయినా సరే.. ఇంకా ఎవరికీ నగదు జమ కానట్లు.. తాను బటన నొక్కితేనే ఖాతాల్లో పడతాయన్నట్లు.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి.. ఉత్తుత్తిగా మీట నొక్కడం ఏమిటోనని రైతులే నవ్వుకుంటున్నారు.
ఆ కేంద్ర పథకాన్ని రాష్ట్ర పథకానికి అన్వయించుకున్నా.. అనుసంధానం చేసుకున్నా.. ఇప్పటికే పడిన నగదుకు మళ్లీ మీట నొక్కిన విషయం తెలిసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా జగన్ బహిరరగంగా మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన సమ్మాన్ నిధి కింద మూడో విడత సాయంగా రూ.2వేలు చొప్పున జనవరి 1న దేశవ్యాప్తంగా రైతులకు చెల్లింపులు జరిగాయి. సాంకేతిక సమస్యల్లేని రైతులందరి ఖాతాలకు ఆ నగదు జమ అయిపోయింది. సొమ్ము పడినట్లు మెసేజ్లు కూడా వచ్చేశాయి. బ్యాంకు ఖాతాల్లో చెక్ చేసుకుంటే, రూ.2 వేలు జమయినట్లు తేలిపోయింది. అయినా జగన్ సర్కారు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన మూడో విడత సొమ్ము రూ.1,036 కోట్లను 50.58 లక్షల మందికి చెల్లిస్తున్నట్లు గత నెల రూ.కోట్లు ఖర్చు పెట్టి పత్రికల్లో ప్రకటనలు గుప్పించింది. పైగా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన కంప్యూటర్లో బటన నొక్కారు.
ఎంత కష్టమైనా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా.. సొమ్ము చెల్లిస్తున్నట్లు గొప్పగా చెప్పుకొచ్చారు. కేంద్రం ఇచ్చేసిన సొమ్ముకు ప్రజాధనం వెచ్చించి ప్రచార పటాటోపం చేసుకోవడమేంటి? నిజానికి ఈ రూ.2వేలు పీఎం కిసాన వాటాగా ఇస్తుంటే కనీసం ప్రధానమంత్రి ఫోటో అయినా ప్రకటనల్లో ఉండాలి కదా! పీఎం కిసానకు సీఎం కలరింగ్ ఏంటని కేంద్రంలో అధికార పార్టీ నేతలు, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
పెట్టుబడి సాయం ఇచ్చేదిలా..!
ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాకముందే ప్రధాని మోదీ ప్రారంభించిన పీఎం కిసాన సమ్మాన పథకం కింద అన్నదాతల్ని ఆదుకునేందుకు పంటలకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6వేలు మూడు విడతల్లో కేంద్రం ఇస్తోంది.
పీఎంకిసానలో పదో విడత సొమ్మును ఈనెల ఒకటో తేదీన రైతుల ఖాతాలకు చెల్లింపులు జరిపింది. అయితే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుభరోసా కింద ఏటా రూ.12,500 ఇస్తామని పేర్కొన్నారు. జగన అధికారం చేపట్టాక.. మరో రూ.వెయ్యి పెంచి, రూ.13,500 ఇస్తామని ప్రకటించారు. కానీ పీఎం కిసానలో ఇచ్చే రూ.6 వేలు కూడా రైతు భరోసాలో కలిపి మిగతా రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు.
కేంద్రం రూ.6 వేలను మూడు విడతలుగా (మే ,అక్టోబరు, జనవరి)లో రూ.2 వేలు చొప్పున నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మేలో రూ.5,500, అక్టోబరులో రూ.2 వేల చొప్పున రూ.7,500ను రెండు విడతల్లో ఇస్తోంది. 2019-20లో 46.69 లక్షల రైతులకు, 2020-21లో 51.59 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందించారు. ఈ ఏడాది 52.38 లక్షల మందికి భరోసా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఒకే రేషనకార్డులో ఎన్ని రైతు కుటుంబాలున్నా, ఒక్కరికే భరోసా వర్తిస్తోంది. పైగా ఆదాయపన్ను, జీఎస్టీ చెల్లిస్తున్నా, యువ రైతులు చదువుకుంటున్నా, పెట్టుబడి సాయం ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15.36లక్షలపైగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమలు ఇవ్వగా, జగన సర్కార్ తెచ్చిన కొత్త కౌలు చట్టంతో భూ యజమాని అంగీకారం అవసరం కావడంతో కౌలు రైతుల్లో 10ు మందికి కూడా పెట్టుబడి దక్కడం లేదు.
రాష్ట్రంలో సాగు భూమి ఉన్న రైతుల సంఖ్య 58 లక్షలపైగానే ఉందని ప్రస్తుత ప్రభుత్వమే 2019 సెప్టెంబరులో తేల్చింది. అలాగే గత ప్రభుత్వ గణాంకాల ప్రకారం కౌలు రైతులు 16 లక్షల వరకు ఉన్నారు. మొత్తం 74 లక్షల మంది రైతులు వ్యవసాయదారులుగా ఉంటే, ప్రభుత్వం కేవలం 48లక్షల మంది రైతులకే పెట్టుబడి సాయం అందిస్తోంది.
అటు పీఎంకిసాన, ఇటు రైతుభరోసా మార్గదర్శకాలు వర్తించని భూయజమానులు 10 లక్షల మంది దాకా ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం తెచ్చిన కౌలుదారు హక్కు చట్టం కింద సీసీఆర్సీ లభించని కౌలు రైతులు 14 లక్షల మంది దాకా ఉన్నారన్నది నగ్నసత్యం. పెట్టుబడి సాయానికి అర్హత లేని భూయజమానులు సంగతి వదిలేసినా, కౌలురైతుకూ భరోసా ఇస్తామన్న జగన్ హామీ ఆచరణలో 10ు మందికి కూడా అమలు కావడం లేదు.