ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం ఇరు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆరోగ్యంగా ఉన్న గౌతమ్ రెడ్డి …అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటుకు గురై మరణించడం కలచివేసింది. అయితే, దుబాయ్ ఎక్స్ పోలో గౌతమ్ రెడ్డి పాల్గొన్న సమయంలో కొంత ఒత్తిడికి గురయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బెదిరించడం వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారని.. పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డిని మానసిక క్షోభకు గురిచేశారని బండారు సత్యనారాయణ షాకింగ్ కామెంట్లు చేశారు. దుబాయ్‌లో ఉండగా గౌతమ్‌రెడ్డిని బెదిరించింది ఎవరని బండారు ప్రశ్నించారు. కాగా, బండారు వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఖండించారు. గౌతమ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలున్నాయని, అవి నివృత్తి కావాలంటే గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతకుముందు, టీడీపీ నేతల బృందం నేడు నెల్లూరులో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్ తదితరులు గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాగా, గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని ఈరోజు ఉదయం నెల్లూరు తరలించారు. నేటి రాత్రికి అమెరికాలో ఉంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు.
బుధవారం ఉదయం 11గంటలకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయి. తన చిన్ననాటి మిత్రుడు, సన్నిహితుడు, క్యాబినెట్ సహచరుడు అయిన గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు సీఎం జగన్ కూడా హాజరవుతున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరులోని ఆయన నివాసంలో కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. రాజకీయాల్లో ఎంతో సౌమ్యుడిగా పేరున్న గౌతమ్ ను కడసారి చూసేందుకు పలువురు రాజకీయ నేతలు, కార్యకర్తలు, మేకపాటి కుటుంబ అభిమానులు, స్థానికులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.