వైసీపీ నేతలు అధికార అహంతో చేసిన తప్పులు ఇపుడు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కోర్టు శిక్ష వేసినా అమలు చేయాల్సింది మన పోలీసులే కదా.. అమలు చేయకపోతే కోర్టు ఏం చేస్తుంది అన్న అజ్జానంతో ఆరోజు వారు కూసిన కూతలు చాలామంది జగన్ అభిమానులను జైల్లో కూర్చోబెట్టాయి.
దేశంలో రాజ్యాంగం కంటే ఏదీ శక్తివంతమైనది కాదని… కోర్టు శక్తి అపరిమితం అని, రాజ్యాంగాన్ని అమలు పరిచే కాపలాదారు కోర్టు అని వారు ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. ఈలోపే కోర్టులను లెక్కచేయకుండా బూతులు మాట్లాడిన వారందరిపై కేసులు నమోదయ్యాయి. చాలామంది జైలులో మగ్గుతున్నారు. వారిని వైసీపీ నేత, సీఎం జగన్ కూడా కాపాడలేకపోయారు.
అయితే, అందరి కంటే ఎక్కువగా కోర్టును దుర్భాషలాడిన వ్యక్తి ఎన్నారై పంచ్ ప్రభాకర్ రెడ్డి. ఇతను యూట్యూబ్ లో ఛానల్ పెట్టి న్యాయమూర్తులపై ఎడాపెడా వాగాడు. అందరికంటే పెద్ద బూతులు వాడాడు. అందుకే ఎవర్ని వదిలినా ఏపీ హైకోర్టు ఇతన్ని వదిలే ప్రసక్తి కనిపించడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇతనిపై విచారణ కొనసాగింది.
ఇతని వల్ల ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టరు కోర్టు ముందు హాజరయ్యాయి. తాజాగా యుట్యూబ్ ఇండియా ప్రతినిధులు కూడా కోర్టు బోనెక్కారు. వారిపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఫైరయ్యింది. సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన వీడియోలను ప్రసారం కాకుండా నిషేధించలేకపోయినందుకు, ఇష్యూ కోర్టుకు వచ్చాక కూడా అతని వీడియోలకు అనుమతి ఇస్తున్నందుకు యుట్యూబ్‌పై హైకోర్టు సీరియస్ అయ్యింది. అమెరికాలో ఉండే ఎన్నారై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి కొత్త టెక్నిక్ ఉపయోగించి యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని న్యాయవాది అశ్వని కుమార్ ఈ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని… అడిగిన వారికి లింక్ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రైవేట్‌గా తన వ్యూస్ ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్లో పేర్కొన్నారు. మరోవైపు సీబీఐ కూడా ఇతని వల్ల తిట్లు తిన్నది.
సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లో పంచ్ ప్రభాకర్ పేరు ప్రస్తావించకపోవడంపై ఏపీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఈ సందర్భంగా సీబీఐని ప్రశ్నించింది. అయితే, అతను అమెరికాలో ఉండడంతో ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో మార్చి 21వ తేదీలోపు పంచ్ ప్రభాకర్ అరెస్ట్‌కు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో హైకోర్టుకు నివేదించాలని హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, ప్రైవేట్ వ్యూస్ నిషేధించడానికి తీసుకుంటున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూట్యూబ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరువురికి ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 21వ తేదీకి వాయిదా వేసింది. పరిస్థితి చూస్తుంటే… ప్రభాకర్ ను అరెస్టు చేసే వరకు కోర్టు వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
బరి తెగింపునకు అడ్డుకట్ట వేయకపోతే మన రాజ్యాంగం చట్టాలపై గౌరవం, భయం పోతుందని కోర్టు అభిప్రాయపడుతోంది. ఆలస్యమైనా ప్రభాకర్ మాత్రం ఊచలు లెక్కపెట్టకుండా ఉండలేడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.