ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దాణా కుంభకోణంలో లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1990లలో లాలా హయాంలో జరిగిన దాణా కుంభకోణంలోని ఐదో కేసులో లాలూను కోర్టు దోషిగా నిర్ధారించింది. దీంతో, లాలూకు రాంచీలోని సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 60 లక్షల జరిమానాను విధించింది. ఈ కేసులో లాలూను గత వారమే కోర్టు దోషిగా నిర్ధారించగా…తాజాాగాశిక్షను ఖరారు చేసింది.
25 ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత దాణా స్కాంలోని ఐదో కేసులో లాలూను దోషిగా నిర్ధారించారు. 1990-1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు అక్రమంగా విత్డ్రా అయ్యాయి. లాలాూ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఈ స్కాంపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఆ దాణా కుంభకోణంలో తాజాగా లాలూకు శిక్ష పడిన ఐదో కేసు అతిపెద్దది కావడం విశేషం. ఈ కేసులో లాలూను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది.
అంతకుముందు, అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్లు విత్ డ్రా చేసినందుకు మొదటి కేసులో లాలూకు 5 సంవత్సరాల శిక్ష పడింది. దేవఘర్ ట్రెజరీ నుంచి నిధుల విత్ డ్రా కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్ల విత్ డ్రా చేసిన మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడు తాజాగా ఐదో కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది.
దీంతో, పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలారు. అయితే ఇది తుది తీర్పు కాదని , సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో, అవసరమైతే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఆర్జేడీ నేతలు అంటున్నారు.