ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించారు.
సోమవారం వేకువన ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికే ఆయన మరణించినట్లు సమాచారం.
ఆయన మృతిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
గౌతమ్ రెడ్డి ఇటీవలే దుబాయ్ ఎక్స్పోలో పాల్గొని వచ్చారు.
49 ఏళ్ల గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 నుంచి వరుసగా రెండు సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన రెడ్డి నెల్లూరు ఎంపీగా పనిచేశారు.
నిర్మాణ రంగం, ఇతర వ్యాపారాలలో ఉన్న ఈ కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లో ఉంది.
లండన్లోొ ఎమ్మెస్సీ చదువుకున్న గౌతమ్ రెడ్డి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు.
ఆరోగ్యం, ఫిట్నెస్పై శ్రద్ధ చూపే నేతగా ఆయనకు పేరుంది. అలాంటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడంపై ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.