సవాంగన్నా…అని పిలుస్తూనే ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై సీఎం జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. కొంపలు మునిగిపోయినట్లు హఠాత్తుగా సవాంగ్ ను తప్పించిన జగన్…ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించడం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ సవాంగన్నను ప్రతిపక్షాల మీద అస్త్రంలా వాడుకున్న జగనన్న…చివరకు కూరలో కరివేపాకులా తీసేశారని విమర్శలు వచ్చాయి. ఇది, సవాంగ్ ను మొదటిసారి జగన్ అవమానించడం.
ఇక, విమర్శలు రావడంతో జగన్…సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించి మమా అనిపించారు. నిరుద్యోగులకు ఇచ్చేందుకు ఉద్యోగాలు లేని ఏపీపీఎస్సీ చైర్మన్ గా సవాంగ్ కు ఉద్యోగం ఇవ్వడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్ట్ లో సవాంగన్నను నియమించిన జగన్ ఆయనను రెండోసారీ అవమానించారు. అయితే, ఆ పదవికి సవాంగ్ అర్హుడా కారా అన్నది చూసుకోకుండా పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి ఐపీఎస్ హోదాలో ఉండగా రాజ్యాంగబద్ద పదవి చేపట్టకూడదని, ఆ కోవలో సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించకూడదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. ఐపీఎస్ కు రాజీనామా చేసిన తర్వాతే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని చెబుతున్నారను. ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి స్వీకరిస్తే.. డీమ్డ్ టూ హేవ్ రిజైన్డ్ అని మరో వాదనను కూడా కొందరు నిపుణులు తెరపైకి తెస్తున్నారు. దీంతో, సవాంగ్ ను జగన్ ముచ్చటగా మూడోసారి అవమానించినట్లయిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. మద్రాస్ హైకోర్ట్ రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ తరహాలోనే సవాంగ్ కు జరిగిందని…గత అనుభవాలను, అవమానాలను చూసి జగన్ ఏమీ నేర్చుకోలేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.