మంచు ఫ్యామిలీ గురించి సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి అందరికీ తెలిసిందే. మోహన్ బాబు వారసత్వాన్నందుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముగ్గురిలో ఎవ్వరూ అనుకున్న స్థాయిలో విజయవంతం కాలేదు. ముఖ్యంగా మంచు విష్ణు.. మంచు లక్ష్మీ ప్రసన్న అయితే ఏమాత్రం ఆదరణ దక్కించుకోలేకపోయారు.
ఇక బయట వీళ్లిద్దరూ మాట్లాడే తీరు.. వాళ్ల వ్యవహారశైలి కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దీంతో సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోతుంటారు. కొంత మేర మోహన్ బాబు సైతం ట్రోల్స్ బాధితుడే. తమ గురించి జరిగే ట్రోల్స్ విషయమై విష్ణు, లక్ష్మి సరదాగానే స్పందిస్తుంటారు. కొన్నిసార్లు తమపై వచ్చే మీమ్స్ కూడా షేర్ చేస్తుంటారు.
ఐతే మోహన్ బాబు ముందు తరం మనిషి కాబట్టి ఈ విషయాన్ని వారిలా స్పోర్టివ్‌గా తీసుకునే అవకాశం లేదు. అసలు మామూలుగా ఆయన ట్రోల్స్ గురించి అసలు స్పందించరు కూడా.ఐతే ‘సన్ ఆఫ్ ఇండియా’ ప్రమోషన్లలో భాగంగా ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన మోహన్ బాబు.. తనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్ మెసేజ్‌లను తనకు తెలిసిన వాళ్లు అప్పుడప్పుడు పంపిస్తుంటారని.. వాటిని చూసినపుడు బాధ కలుగుతుంటుందని మోహన్ బాబు అన్నారు. ట్రోల్స్ అంటే నవ్వించేలా ఉండాలని… అసభ్యకరంగా ఉండకూడదని ఆయనన్నారు.
ఇద్దరు హీరోలు కొందరిని అపాయింట్ చేసుకుని ఇలాంటి ట్రోల్స్ క్రియేట్ చేస్తున్నారని.. ఆ హీరోలెవరో తనకు బాగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ట్రోల్స్ ద్వారా వాళ్లు తాత్కాలిక ఆనందం పొందవచ్చని… కానీ ఏదో ఒక సమయంలో వాళ్లు కూడా ఇలాంటి ఇబ్బంది ఎదుర్కోక తప్పదని మోహన్ బాబు అన్నారు.
మోహన్ బాబు కొత్త చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’ విడుదల నేపథ్యంలో ఈ సినిమాకు బుకింగ్స్ పేలవంగా ఉండటంపై పెద్ద ఎ్తతునే ట్రోలింగ్ జరుగుతుండటం గమనార్హం.