రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం…జగనన్న కాలనీలంటే కేవలం ఇళ్లు కాదు…అవి గ్రామాలు…అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం…సువిశాల స్థలంలో ఇల్లు కట్టించి అక్క చెల్లెమ్మలకు కానుకగా ఇస్తాం…ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన మాటలు విని ముందూ వెనుక చూడకుండా అక్కచెల్లెమ్మలు కూడా జగనన్నకు ఓటేశారు. సీన్ కట్ చేస్తే…ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటారా…లేదంటే స్థలాలు వెనక్కు ఇచ్చేస్తారా? అంటూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు గొంతుమీద కత్తి పెట్టడంతో జగనన్న అక్కచెల్లెమ్మలు అయోమయంలో పడి లబోదిబోమంటున్నారు.
ఆ పథకం ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించి ఏడాదిన్నర గడిచింది. ఇంకా ఇళ్లు ప్రారంభించని వారికి నోటీసులు ఇస్తున్నారు. ఇంకా ఎందుకు మొదలుబెట్టలేదన్న విషయంపై లిఖిత పూర్వకంగా వివరణ తీసుకుంటున్నారు. కరోనాతో ఆదాయం తగ్గిపోవడం, నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్నంటడంతో ఆప్షన్-3 ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు. అయితే, మార్చి 31లోపు రూ.1.80వేల నిధులు ఖర్చు చేయకుంటే…అవి మురిగిపోతాయని అధికారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే…ఒక బిల్లు పడితే ఎలాంటి సమస్యా ఉండందంటున్నారు. దీంతో, కొన్నిచోట్ల మాత్రం ఇంటి నిర్మాణం ప్రారంభించకుంటే స్థలాన్ని వెనక్కి తీసుకొని ఇతరులకు కేటాయిస్తామని వాలంటీర్లతో బెదిరింపులకు దిగుతున్నారు.
‘‘ఆ ఇళ్లు కట్టుకోవడం మా వల్ల కాదు…పునాది కనీసం 9 అడుగులు తీయకుంటే ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది…. మీరిచ్చే రూ.1.80లక్షలు పునాదులు, బెల్ట్ వరకే సరిపోతుంది. డ్వాక్రా ద్వారా అప్పుగా ఇప్పించే రూ.35వేలు ఎందుకూ సరిపోదు. ఇల్లు పూర్తికావాలంటే మరో రూ.2లక్షలు కావాలి. రెక్కాడితే కాని డొక్కాడని పేదవాళ్లం…అందులోనూ కరోనా కాలం…అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది? అప్పో సప్పో చేసి ఇల్లు పూర్తి చే సినా..వాటికి జీవితాంతం వడ్డీలు కట్టుకోవాల్సిందే. జగనన్న ఇళ్లు కట్టించి ఇస్తానని చెబితే ఆశగా ఆ ఆప్షన్‌కు థంబ్ వేశాం. ఇచ్చిన మాట ప్రకారం జగనన్నే ఇట్లు కట్టివ్వాలి…’’ అని జగనన్న ఇళ్ల లబ్ధిదారులు తమ గోడు మీడియా ముందు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు చెప్పిన ప్రకారం జగనన్న ఇల్లు కడితే తమ ఒళ్లు గుల్లేనని వాపోతున్నారు.