కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చూస్తుంటే పరిణామాలు కలిసివస్తున్నట్లే కనిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు మాజీ ప్రధాని, జేడీఎస్ రథసారథి దేవేగౌడ కేసీఆర్ కు సంఘీభావం తెలిపారు. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు దేవేగౌడ తన మద్దతు తెలిపారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్ను ఆయన అభినందించారు. దేశ లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మేమందరం మీకు అండగా వుంటాం. మీ యుద్దాన్ని కొనసాగించండి. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది అంటూ దేవేగౌడ కేసీఆర్ తో అన్నారు.
ఈ పరిణామం జరిగిన మరుసటి రోజే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కూడా సీఎం కేసీఆర్ కు మద్దతిచ్చారు. ఈ నెల 20న ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నారు. ఈ మేరకు ఇద్దరు సీఎంల భేటీ తేదీ ఖరారు అయింది. తెలంగాణ సీఎం కేసీఆర్కు ఈ రోజు ఉదయం మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఫోన్ చేసి.. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారని తెలంగాణ సీఎం కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. ‘కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం. ఈ దేశాన్ని విభజన శక్తుల నుండి కాపాడుకోవడానికి సరైన సమయంలో మీరు గళం విప్పారు.
రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం’ అని పేర్కొన్నట్లు వివరించింది. ‘మిమ్మల్ని ముంబయికి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి. అదే సందర్భంలో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందాం’ అని సీఎం కేసీఆర్ను ఉద్ధవ్ థాక్రే ఆహ్వానించారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు 20న కేసీఆర్ ముంబయికి వెళ్లనున్నారు.