తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేదు. రాజకీయపరమైన, మతపరమైన విషయాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజా సింగ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. హిందూ ధర్మ, గోవుల పరిరక్షణకు అవసరమైతే సొంతపార్టీతోనైనా కొట్లాడతానని చెప్పిన రాజా సింగ్ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా యూపీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
యూపీలో యోగికి మద్దతివ్వని వారికి రాజా సింగ్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. యూపీలో ఉండాలనుకుంటే యోగికే ఓటు వేయాలని…లేదంటే యూపీ వదిలి వెళ్లేందుకు రెడీగా ఉండాలని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. హిందూ సోదరులంతా బీజేపీకే ఓటు వేయాలని, ఓటు వేయని వారి జాబితాను వెతికితీస్తామని అన్నారు. ఇప్పటికే యోగి వేల సంఖ్యలో బుల్డోజర్లు, జేసీబీలను యూపీకి తెప్పించారని, వాటితో ఏం చేస్తారో అందరికీ తెలుసని వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీకి ఓటువేయనివారి ఇళ్లను బుల్డోజర్లు, జేసీబీలతో ధ్వంసం చేస్తామని పరోక్షంగా రాజా సింగ్ హెచ్చరించారు. బీజేపీకి ఓటువేయని వారంతా ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పోలింగ్ శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. ఎన్నికల్లో హిందువులంతా ఏకం కావాలని, అందరూ కలిసి యోగికి ఓటు వేసి మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. యోగి మళ్లీ సీఎం కాకూడదని కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ తరహాలో ఓటర్లను బెదిరించిన రాజాసింగ్ పై ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.