ఏపీలో పీఆర్సీ వ్యవహారంపై ఉద్యోగులు వర్సెస్ ప్రభుత్వం అన్న రీతిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి…ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే, చలో విజయవాడ విజయవంతం కావడానికి, లక్షలాది మంది ఉద్యోగులు బెజవాడకు భారీగా చేరుకోవడానికి పోలీసుల వైఫల్యమే కారణమని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది.
అంతేకాదు, చలో విజయవాడ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై జగన్ ఫైర్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా డీజీపీ సవాంగ్ పై జగన్ బదిలీ వేటు వేశారు. జగన్ తో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ నేడు భేటీ అయిన తర్వాత బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడ్డాయి. అయితే, సవాంగ్ కు ఏ పోస్ట్ ఇవ్వని ఏపీ సర్కార్….ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించడం విశేషం.
మరోవైపు, సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది జగన్ సర్కార్. ప్రస్తుతం ఇంటిలిజెన్స్ డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు ఇస్తూ ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. విశాఖ సీపీగా సేవలందించారు. హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా కూడా విధులు నిర్వర్తించిన రాజేంద్రనాథ్ రెడ్డి…. పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగానూ పనిచేశారు. 1992 బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నారు.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. వివాదాస్పద నిర్ణయాలు, జీవోలతో జగన్ కు ఆగ్రహం తెప్పించిన కారణంగానే బదిలీ వేటు పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులు సమ్మెకు వెళ్లడానికి కూడా ఆయనే కారణమని జగన్ భావిస్తున్నారట. ప్రభుత్వం చెప్పినదానికి ఉద్యోగులు అంగీకరించారని ప్రకాష్ చెప్పడంతోనే వారు సమ్మెకు వెళ్లరని జగన్ అనుకున్నారట. కానీ, సమ్మెకు వెళ్లిన తర్వాత అసలు విషయం జగన్ కు తెలియడంతో హుటాహుటిన ప్రవీణ్ ప్రకాష్ పై వేటు వేశాటర. ఈ క్రమంలోనే ఇటీవలి జరిగిన ఓ సభలో సీఎం జగన్ దగ్గర ప్రవీణ్ ప్రకాష్ మోకాళ్లపై కూర్చుని మరీ మాట్లాడారని అనుకుంటున్నారు. ఇన్ని చేసినా…వేటు తప్పలేదని టాక్ వస్తోంది.