ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు రోజుల పాటు సాగిన రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం ఒక కొలిక్కి వచ్చినట్లే. యాగపూజల కోసం ఏకంగా 5 వేల మంది రుత్వికులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీ నారాయణ మహాక్రతువు సోమవారంతో పూర్తైంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ క్రతువు కోసం చేసిన ఖర్చుల లెక్క విషయంలోనే ఎక్కడో తేడా కొడుతోందన్న మాట బలంగా వినిపిస్తోంది.
జరిగింది ప్రైవేటు ప్రోగ్రాం కాబట్టి.. ఇలాంటి లెక్కల సంగతి మీకెందుకు? అని అనేయొచ్చు ఎవరైనా? కానీ.. ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ..ఈ కార్యక్రమం కోసం ప్రజల నుంచి పెద్ద ఎత్తున చందాలు వసూలు చేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు. పలువురు రుత్వికులు.. యాగాలు చేసే వారి నుంచి వ్యక్తమైన సందేహాలు అర్థవంతంగా ఉండటంతో ఆ అనుమానాలపై చర్చ జరుగుతోంది.
ముచ్చింతల్ వేదికగా చేసుకొని జరిగిన పన్నెండు రోజుల భారీ కార్యక్రమానికి దేశ రాష్ట్రపతి.. ప్రధానమంత్రి మొదలు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు రావటంతో పాటు లక్షలాది మంది ఈ మహాక్రతువును సందర్శించారు. ఈ సందర్భంగా 2 లక్షల కేజీల స్వచ్చమైన ఆవునెయ్యి వాడినట్లుగా నిర్వాహకులు గొప్పలు చెప్పుకోవటం తెలిసిందే. ఎంత భారీ కార్యక్రమం అయినా పన్నెండు రోజుల్లో 2 లక్షల కేజీల ఆవునెయ్యి వినియోగించటం ఆచరణలో కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అలా ఎలా చెబుతారు? అన్న సందేహం రావొచ్చు. ఇక్కడే యాగ పూజల్లో భాగస్వామ్యం ఉన్న వారు చెప్పిన లెక్కలతో దీన్ని మేం రాయగలుగుతున్నాం. ముచ్చింతల్ కార్యక్రమ నిర్వాహకులే స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం 114 యాగశాలల్లో 1035 హోమ కుండలాల్లో 2 లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవునెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాయిహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించినట్లు చెప్పారు.
ఒక్కో హోమ కుండలాల్లో రోజులో ఎంత ఎక్కువగా వినియోగించినా 5 కేజీలకు మించి ఆవునెయ్యి వాడకం ఉండదని చెబుతున్నారు. మరీ మీరు ఇంత దారుణమైన అభాండాలు వేస్తారా? అన్న వారి కోసం ఒక్కో హోమగుండంలో పది కేజీల ఆవునెయ్యి వాడారనే అనుకుందాం. అంటే.. 1035 హోమ కుండలాల్లో రోజుకు పది కేజీల చొప్పున వేసుకుంటే.. 10,350 కేజీలు అవుతుంది. మొత్తం 12 రోజులకు 1,24,200 కేజీలు మాత్రమే అవుతుంది. భారీగా ఖర్చు చేశారని భావించినా.. లెక్క లక్షా పాతిక వేల కేజీలను దాటదు. యాగాల్లో భాగస్వామ్యం ఉన్న వారి లెక్కల ప్రకారం ఐదారు కేజీలకు మించి ఒక్కో యాగగుండంలో ఆవునెయ్యి వాడే అవకాశం లేదంటున్నారు.
మరి.. అలాంటప్పుడు 2 లక్షల కేజీల వినియోగం ఎలా జరిగి ఉంటుంది? అన్నది ప్రశ్న. మరోవైపు 2 లక్షల కేజీల ఆవునెయ్యి వాడినట్లు చెబుతున్నారు కదా? అంత భారీ ఎత్తున వాడిన ఆవునెయ్యిను సప్లై చేసిన వారెవరు? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే.. మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఏదైనా మహా కార్యక్రమం జరిగినప్పుడు సాధారణంగా భారీ ఎత్తున వినియోగించిన వస్తువులకు సంబంధించిన సమాచారం.. విశేషాలను సైడ్ లైట్స్ రూపంలో బయటకు వస్తుంటాయి.
కానీ.. ముచ్చింతల్ మహా యాగానికి సంబంధించి మాత్రం అలాంటివేమీ రాకపోవటం గమనార్హం. ఇదంతా ఎందుకు? చినజీయర్ స్వామి వారే స్వయంగా రెండు లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవునెయ్యి వినియోగానికి సంబంధించిన లెక్కను కాస్త విప్పిదీసి చెప్పేస్తే.. అనుమానాలన్ని పటాపంచలు అయిపోతాయ్ కదా? అది జరిగేనా?