ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. జిల్లాల పర్యటనల్లో ఇప్పటికే విరుచుకుపడిన కేసీఆర్ తాజాగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ బీజేపీని టార్గెట్ చేశారు. అయితే, ఈ క్రమంలో ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మాట్లాడటం ఆసక్తికరం.
తాజాగా ప్రగతి భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు కీలక అంశాలు తెలిపారు. జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్న సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడినప్పటికీ అక్కడ అన్ని విషయాలు చెప్పలేం కాబట్టి ఈ విలేకరుల సమావేశం అని కేసీఆర్ వివరణ ఇచ్చారు.
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చారు. ఈ సంస్కరణలకు సంబంధించి డ్రాఫ్ట్ బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు మెడ మీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్ కాకముందే.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్ అధనంగా 0.5 ఎఫ్ఆర్బీఎం ఇస్తామని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు. పోయిన ఏడాది మనం తీసుకోలేదు. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకుంది“ అంటూ ఏపీ ప్రస్తావన తెచ్చారు.