ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కామెంట్లు చేసిన అనంతరం దానిపై నేడు జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే ఢిల్లీ కోటలు బద్దలు కొడుతాం.. నరేంద్ర మోడీ జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాం అని కేసీఆర్ ప్రకటించారు.
సిద్దిపేట ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే తెలంగాణను సాధించానని ప్రకటించిన కేసీఆర్ మీరు కూడా దీవెనలు ఇస్తే ఢిల్లీ కోటలను బద్ధలు కొడుతాం అని ప్రకటించారు.
“జనగామ టౌన్లో టీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ వాళ్లు కొట్టారు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని ముట్టుకుంటే నాశనం చేస్తాం. మేం ఊదితే మీరు అడ్రస్ లేకుండా పోతారు. జాగ్రత్త నరేంద్ర మోడీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాటం చేశామని అదే రీతిలో దేశం గురించి కూడా కొట్లాడాలి. జాతీయ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మోడీని ఈ దేశం నుంచి తరిమేస్తామని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
`ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు. మెడికల్ కాలేజీ ఇవ్వరు. నువ్వు ఇవ్వకున్నా మంచిదే. ఈ దేశం నుంచి నిన్ను తరిమేసి.. ఇచ్చేటోన్ని తీసుకొచ్చుకుంటాం.“ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.