ఏపీలో అప్పులు…వాటి కోసం జగన్ పడుతున్న తిప్పలు…కొద్ది నెలలుగా ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఏపీలో జనంపై జగన్ అప్పుల భారం మోపుతున్నారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ అప్పుల తిప్పలపై చంద్రబాబు ఏపీ ప్రజలకు షాకింగ్ అప్ డేట్లు ఇచ్చారు. ఏపీలో ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు భారాన్ని జగన్ మోపారని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. రాష్ట్ర జనాభా 5 కోట్లు…రెండున్నరేళ్లలో జగన్రెడ్డి రూ.7లక్షల కోట్ల అప్పులు చేశారని మండిపడ్డారు. జగన్ చేసే అప్పులు ఎవరూ కట్టరని.. రేపు ప్రజలే కట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెడుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
”కలెక్టరేట్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, బెర్మ్ పార్క్ కూడా తనఖా పెట్టారు. చివరకు రోడ్లు, ప్రైవేటు ఆస్తులూ తనఖా పెడ్తారు. అప్పుల్లో ఉన్నాం. ఎవరమూ తప్పించుకోలేం. ఆకాశం నుంచి ఎవరూ రారు. అప్పులు మనమే కట్టాలి. మరో పక్క పన్నులు పెంచేస్తున్నారు. ఎందుకీ పన్నుల భారం? ఈ డబబ్బులనీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? అప్పులన్నీ పెరిగిపోయి..రాష్ట్రంలో ఆస్తులు అమ్మేసి ఏపీని లేకుండా చేస్తున్నారు.” అని చంద్రబాబు రాష్ట్రానికి జగన్ చేస్తున్న అన్యాయాన్ని బట్టబయలు చేశారు.
జగన్కు సొంత లాభం తప్ప.. ప్రజాక్షేమం పట్టదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారి పోయాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందని, రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి తానే చివరి సీఎం అన్నట్లు.. రాష్ట్రంలో ఉన్న ఆస్తులను జగన్ అమ్ముతున్నారని దుయ్యబట్టారు. చివరికి చెత్త పైనా పన్ను వేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు.
దేశంలో నిత్యావసరాలు, గ్యాస్, లిక్కర్ ధరలు ఏపీలోనే ఎక్కువ అని తెలిపారు. సహజ వనరుల దోపిడీకి పాల్పడుతూ ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారని అన్నారు. నీతి నిజాయితీగా రాష్ట్రంలో రూపాయి కూడా ఎవరూ సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చరిత్రలో ఎవరూ చేయని నష్టం ఏపీకి జగన్ చేశారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటివరకు పాలకులంతా కలిపి చేసిన అప్పు ఒక్క జగన్ చేశారని దుయ్యబట్టారు. ఒక్కసారి యువత ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న దశలో ఆంధ్రప్రదేశ్ పతనావస్థలోకి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.