సినీ నటుడు ఆలీకి సీఎం జగన్ హామీ ఇచ్చారా? ఆయన రాజకీయంగా బంపరాపర్ దక్కనుందా? సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై జరిగిన చర్చల కోసం గురువారం ఇక్కడకు వచ్చిన ఆలీని వారం రోజుల తర్వాత తనను కలవాలని సీఎం జగన్ సూచించారా? అంటే.. ఔననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు.
ఆయనకు రాజ్యసభ సీటు లేదా.. ఎమ్మెల్సీ సీటు ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో 3 నెలల తర్వాత ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు ఎంపిక కానున్నారు. దీనిలో ఒక సీటు మైనార్టీల కు ఇచ్చే ఆలోచనలో ఉన్న జగన్… ఆ అవకాశం ఆలీకి కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు.. ఎమ్మెల్సీ సీట్లు కూడా త్వరలోనే ఖాళీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను మండలి కైనా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు మైనార్టీలకు ఈ కోటాలో అవకాశం ఉన్నా.. మరింత పెంచాలని.. వచ్చే ఎన్నికల నాటికి మైనారిటీ వర్గాన్ని తనవైపు మరింతగా తిప్పుకోవాలని జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని మైనార్టీ కి చెందిన మహిళకు కేటాయించారు. అయినా.. కూడా మైనార్టీ వర్గానికి మరో రెండు స్థానాలు ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఆలీకి జగన్ మరో వారం తర్వాత అప్పాయింట్మెంట్ ఇవ్వనుండడం ఆసక్తిగా మారింది. గత ఎన్నికల సందర్భంగా రాజమండ్రి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆలీకి ఆ అవకాశం దక్కలేదు. అయినా వైసీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా పదవి కోసం ఎదురు చూస్తున్న ఆలీ పేరు ఇటీవల ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగా ప్రచారంలోకి వచ్చినా అప్పుడూ నిరాశే ఎదురైంది.
దీంతో ఇప్పుడు రాజ్యసభకు లేదా మండలికి పంపే అవకాశముందన్న చర్చ జోరందుకుంది. ఈ విషయమై మీడియా ఆలీని సంప్రదించగా ‘సీఎం తర్వాత కలవమన్నారు.. ఏమిస్తారో నాకు తెలీదు’ అని పేర్కొనడం గమనార్హం. మొత్తానికి సీఎం అయితే.. ఆలీని భేటీ కావాలని కోరడం గమనార్హం. దీనిని బట్టి ఆయనకు పదవి ఖాయమనే వాదన తాడేపల్లి వర్గాల నుంచి వినిపిస్తోంది.