ఏపీలో సినిమా టికెట్ల రేట్ల వ్యవహారం త్వరలోనే ఓ కొలిక్కి రానుందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని చిరు చెప్పడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందన్న టాక్ వస్తోంది. ఈ క్రమంలోనే రేపు జగన్ తో చిరు, సినీ పెద్దలు భేటీ కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ భేటీ తర్వాత కీలక ప్రకటన వెలువడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా టికెట్ రేట్ల వ్యవహారంపై నియమించిన కమిటీ కూడా తన నివేదికను మంత్రి పేర్ని నానికి సమర్పించిందన్న టాక్ వస్తోంది.సినిమా టికెట్ల రేట్లు పెంచితేనే మంచిదని ఆ కమిటీ తీర్మానించి రిపోర్ట్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఆ కమిటీ రిపోర్ట్ పై జగన్ తో పేర్ని నాని కూడా చర్చించబోతున్నారని, రేపటి భేటీకి ముందే ఆ చర్చ జరుగుతుందని తెలుస్తోంది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామపంచాయతీల్లో ఉన్న థియేటర్లలో టికెట్ల రేట్లు పెరగనున్నాయని, ప్రాంతం ఏదైనా సరే, నాన్ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా కనీస టికెట్ ధర 30 రూపాయలు ఉండాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నాన్‌ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్‌ను..70 రూపాయలకు పెంచాలని రిపోర్ట్ లో ఉందట. ఏసీ థియేటర్లో మినిమమ్ 40 రూపాయలుగ టికెట్ ధర ఉండాలని, అత్యధికంగా 150 రూపాయలకు పెంచుకునేలా పర్మిషన్ ఇవ్వాలని కమిటీ నివేదికనిచ్చిందట.
మల్టీప్లెక్సులలో టాప్ టు బాటమ్ ఒకటే టికెట్ కాకుండా.. ప్రీమియం, డీలక్స్, ఎకానమీ క్లాస్‌లు తప్పనిసరిగా ఉండాలని కమిటీ నివేదికనిచ్చిందట. హాల్ ఉండే ప్రాంతాన్ని బట్టి కాకుండా ఏసీనా, నాన్ఏసీనా, మల్టిప్లెక్సా అన్న దానినిని బట్టి టికెట్ రేట్ నిర్ణయించాలని కమిటీ సలహా ఇచ్చిందట. మరి, ఈ కమిటీ నివేదికను ప్రభుత్వం ఫాలో అవుతుందా..? జీవో నంబర్ 35ను సవరిస్తుందా అన్నది తేలాల్సి ఉంది.