తాజాగా పార్లమెంటు వేదికగా.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనకు సంబంధిచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మంట పెట్టాయి. ప్రధాని మోడీపై మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్‌రావు ఖండించారు. వచ్చే శనివారం ఉదయం 11 గంటలకు, హరీష్, రేవంత్ రెడ్డితో అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్దమని రఘునందన్ రావు సవాల్ విసిరారు.
రాష్ట్ర మంత్రి హరీష్‌రావు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలను ఖండించారు. మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్ ఎక్కడున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. వచ్చే శనివారం ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డితో అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్దమని రఘునందన్ రావు సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డిని తయారు చేసిన చంద్రబాబే… 1997లో తెలంగాణను అడ్డుకున్నట్టు ఆనాడు అడ్వాణి చెప్పారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో హరీశ్‌రావుకు అగ్గిపెట్టె దొరికి ఉంటే 1200 మంది యువకుల ఆత్మబలిదానాలు జరిగేవి కాదని రఘునందన్ అన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు ఇచ్చిన నిధులు దుబ్బాకకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మంత్రి హరీశ్‌రావు శిలాఫలకాలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేల పేర్లు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
లోక్‌సభ, రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలుపుతూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, టీఆర్ ఎస్ నేతలకు ఏం అర్ధమయ్యాయో తెలియటం లేదన్నారు. గతంలో వాజ్‌పేయ్ హయాంలో ఘర్షణ లేకుండా దేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసిందని, కాంగ్రెస్ ఎలాంటి చర్చలేకుండా ఏపీని విభజించిందని మాత్రమే మోడీ అన్నారని రఘునందన్ చెప్పారు. సహచర ఎంపీలను రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్టు సంభోదించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం మీద రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదనిదుయ్యబట్టారు.
1200 మంది చనిపోడానికి కారణమైన టీఆర్ ఎస్, నరేంద్రమోడీని విమర్శిస్తోందని దుయ్యబట్టారు. దుబ్బాక, హుజురాబాద్‌లో సిలిండర్లు మోసినా.. ప్రజలు తిప్పికొట్టారని హరీశ్‌రావు మర్చిపోయినట్టున్నాడని వ్యాఖ్యానించారు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, దుబ్బాకకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పడం లేదనన్నారు. 53 కోట్లు ఉపాధిహామీ పథకం నిధులు కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాకు ఇచ్చారని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని రఘునందన్ రావు తెలిపారు.