టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్రావు మధ్య దోస్తీకి బీటలు వారినట్లు రాజకీయ వర్గాల్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటు కేసీఆర్ కి, అటు జగన్ కి ఆర్థికంగా ఈయన అండగా నిలిచారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంటారు.
రామేశ్వరరావు సొంత ఛానెల్ వార్తలు చూస్తే అందులో నిజముందని అనుమానాలు రాక మానదు. ఎందుకంటే ఆ ఛానెల్లో జగన్ కి, కేసీఆర్ కి వ్యతిరేకంగా వార్తలు రావడం రెండేళ్లుగా రావడం లేదు. ముఖ్యంగా మై హోం అధినేత జూపల్లి కేసీఆర్‌కు కుడిభుజంగా, టీఆర్ఎస్కు ప్రధాన ఫైనాన్షియర్‌గా అందరి నోళ్లలో నానుతున్నారు.
2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీతోనూ జూపల్లి ‘సత్సంబంధాలు’ పెట్టుకోవడం మొదలుపెట్టారు. 2014 నుంచి టీఆర్ఎస్, బీజేపీలు కూడా పరస్పరం సత్సంబంధాలు కొనసాగించడంతోపాటు పార్లమెంట్లో బీజేపీకి టీఆర్ఎస్ మద్దతివ్వడంతో 2014 నుంచి కేసీఆర్, మోదీ ఇద్దరితోనూ ఏకకాలంలో సత్సంబంధాలు కొనసాగించేందుకు జూపల్లికి ఎలాంటి ఇబ్బంది లేదు.
అయితే 2021 నవంబర్‌లో జరగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.కేసీఆర్ మోడీలకు చెడిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీకి దూరంగా ఉండమని రామేశ్వరరావుకు కేసీఆర్ సూచించారట. అయితే, కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న మోడీని వదలడం రామేశ్వరావుకి ఇష్టం లేదు. పైగా 2023లో కేసీఆర్ గెలుపునకు అవకాశాలు కూడా బాగా సన్నగిల్లాయట. ఈ నేపథ్యంలో కేసీఆర్ మాటలను రామేశ్వరరావు లైట్ తీసుకున్నారు.
ముఖ్యంగా ఇద్దరితో స్నేహంగా ఉందామని రామేశ్వరావు ప్రయత్నం చేస్తున్న సమయంలో టీఆర్ఎస్, బీజేపీలను ‘ప్రత్యర్థులు’గా మారడం జూపల్లిని బాగా కలవరపెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి జూపల్లి కేసీఆర్ తో తెగదెంపులు చేసుకోలేదు. కాకపోేత ఇద్దరితో సంబంధాలు కోరుకుంటున్నారు. అయితే తనకు ఇష్టం లేకుండా మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న జూపల్లిపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏర్పాటు వెనుక ప్రధాన వ్యక్తి జూపల్లి. ఈ విగ్రహం ఏర్పాటు కోసం చిన జీయర్ స్వామికి డబ్బు మరియు భూమిని విరాళంగా ఇచ్చాడు. ఈ విగ్రహాన్ని శనివారం మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బీజేపీతో రాజకీయ వివాదాల వల్ల ప్రొటోకాల్ ను కూడా పట్టించుకోకుండా కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని దాటవేశారు. ఈ సమావేశంలో జీయర్ స్వామి, జూపల్లి మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ పేరును అసలు పట్టించుకోలేదు. దీంతో వివాదం మరింత ముదిరేలా ఉందని అంటున్నారు.