రాజకీయాలంటేనే ఎత్తులు – పైఎత్తులకు మారు పేరు. ఒక్కోసారి అంతర్గత కుట్రలు చేస్తూ ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటాయి. ఎంతటి కీలకనేతలు అయినా, ఇలాంటి వాటిని ఎదుర్కోక తప్పదు. వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు సైతం ఇలాంటి పరిస్థితి తప్పలేదు. ప్రస్తుతం తను ఎదుర్కుంటున్న పరిస్థితికి ,ఇంకా చెప్పాలంటే వైసీపీలో ఉన్న అంతర్గత రాజకీయాలకు రోజా తీవ్రంగా కలతచెందారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తనను అణగదొక్కలేరంటూ రోజా కామెంట్ చేశారు.
నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ఇటు సినీ జీవితం అటు రాజకీయ జీవితం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, నియోజకవర్గంలో ఆమె ఒకింత సవాల్లు ఎదుర్కుంటున్నారు. రోజాపై ఓటమి పాలయిన టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ నియోజకవర్గ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. నగరిలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీ పెద్ద ఎత్తున జరుగుతోందని ఆరోపించారు. నాడు తన తండ్రి ముద్దుకృష్ణమ చెన్నైకు మట్టి తరలిపోకకుండా చర్యలు తీసుకుంటే.. నేడు ఎమ్మెల్యే రోజా మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చారని గాలి భానుప్రకాష్ విమర్శించారు. గ్రావెల్ దోపిడీకి ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని… లో ఎమ్మెల్యే రోజాకు వాటా ఉందంటూ ఇటీవల గాలి భానుప్రకాష్ ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అండతో నగరి సంపదను కొల్లగొడుతున్నారని.. ఆంబోతుల్లా నగరి మీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు.
తనపై కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోజా తెలిపారు. తన బ్యాంక్ బ్యాలెన్స్ బహిర్గతం చేస్తానని ప్రకటించిన రోజా తాను అక్రమంగా సంపాదిస్తున్నారని మాట్లాడితే.. మూతి పగిలిపోతుందని గాలి భానును ఉద్దేశించి హెచ్చరించారు. వైసీపీలో ఉన్నవారి అండదండలతో తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఇటు సొంత పార్టీ నేతలకు అటు ప్రతిపక్ష నాయకులకు క్లారిటీ ఇచ్చేశారు. తాను ప్రజల మధ్యే ఉంటానని… ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని, అందుకే నగరిలో ఇల్లు కట్టుకున్నానని రోజా స్పష్టం చేశారు. కాగా , ఏకకాలంలో ఇటు స్వపక్ష అటు విపక్ష నేతలకు రోజా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.