ఏపీలో కొన్ని నెలలుగా నెలకొన్న సినిమా టికెట్ల తగ్గింపు వ్యవహారం రాజకీయంగాను.. సినిమా పరంగానూ.. తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ.. జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై.. సినిమా రంగం నుంచి రామ్గోపాల్ వర్మ సహా అనేక మంది స్పందించారు. అయితే.. అందరూ కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇక, విపక్షాలు కూడా తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించాయి. పేదలను దృష్టి లో పెట్టుకున్నప్పుడు.. పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు తగ్గించాలని.. డిమాండ్ చేశారు.
అయితే..ఇంత జరిగినా.. ఈ వివాదంపై అత్యంత కీలకమైన.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కానీ, ఆయన కుటుంబం కానీ.. స్పందించలేదు. దీంతో వీరిపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే.. తాజాగా.. తిరుపతికి వచ్చిన మంచు విష్ణు ఈవిషయంపై స్పందించారు. సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రబుత్వంతో మాట్లాడతానని అన్నారు. సినిమా టికెట్ల ధరలు తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారని ఆయన అన్నారు. టికెట్ల ధరలపై సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలని సూచించారు.
సినిమా టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకెళ్తామని విష్ణు చెప్పారు. ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.. తాను విడిగా మాట్లాడితే సమస్య పక్కదారి పడుతుందని చెప్పారు. అందుకే మౌనంగా ఉన్నానని అన్నారు. రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు..
టికెట్ల ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసిందని, చిరంజీవి, జగన్ కలయిక వ్యక్తిగత సమావేశమేనని అన్నారు. చిరంజీవి, జగన్ సమావేశం అసోసియేషన్ సమావేశంగా భావించకూడదన్నారు. ‘మా’ అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడతానని చెప్పారు. సినిమా టికెట్లపై తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వ్యక్తిగతంగా తన నిర్ణయంతో పనిలేదన్న ఆయన ఎవరూ తన అభిప్రాయం అడగట్లేదని చెప్పుకొచ్చారు. టికెట్లపై వైఎస్ హయాంలోనే జీవో వచ్చిందని,.. దానిపైనా చర్చ జరగాలని అన్నారు.