ఏపీలో పీఆర్సీ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గినప్పటకీ…ప్రధాన డిమాండ్లు మాత్రం నెరవేరే పరిస్థితి కనబడడం లేదు. దీంతో, ఉద్యోగులు ఈ రోజు కూడా పెన్ డౌన్ కొనసాగించారు. ఇక, పీఆర్సీపై డిమాండ్లు నెరవేరకుంటే సమ్మెబాట పట్టేందుకు కూడా ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు సైతం జత కలిశారు.
ఫిబ్రవరి 6వ తారీకు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగాలని ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో, ఒకవేళ చర్చలు విఫలమైతే…ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, వారు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగులు తమ మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడేలా లేదు. ఎస్మా ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. ఈ ప్రకారం గనుల శాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో, ఈ ఉత్తర్వులపై గనుల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే ఎస్మా ప్రయోగించడం ఏమిటని నిలదీస్తున్నారు. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.